సభ వద్ద కొత్త ఉపాధ్యాయులకు విందు భోజనం
డీఎస్సీ అక్రమాలపై ప్రజల దృష్టిని మళ్లించే చంద్రబాబు చర్యల్లో పావులుగా మారిన కొత్త టీచర్లు
కర్నూలులో డీఎస్సీ–2025 టీచర్ల ర్యాలీకి భారీ ఏర్పాట్లపై విమర్శల వెల్లువ
ర్యాలీ కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, డీజే సిస్టం, మొబైల్ టాయిలెట్లు..
బస్సుల్లో కూల్‌డ్రింక్స్, స్నాక్స్, భోజన సదుపాయాలు..
ర్యాలీ వద్ద సైతం విందు భోజనం
పూర్తిగా సహకరించిన కడప ఆర్‌జేడీ!
కొన్నిచోట్ల ర్యాలీకి వచ్చే బస్సుల వద్ద టీచర్ల హాజరు నమోదు
ర్యాలీలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సభ్యుల హడావుడి
యువగళం పాదయాత్ర బృందాలు సైతం హల్‌చల్
ఈ కార్యక్రమం విజయవంతం కోసం కర్నూలులోనే టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్, రామ్‌గోపాల్‌రెడ్డి తిష్ట!
కర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ ‘ఒక పక్కా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత నుంచి... అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో జెన్–జెడ్ చేస్తున్న ఆందోళనలకు వస్తున్న అనూహ్య స్పందన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేపట్టిన ‘సర్కారు స్పాన్సర్డ్ డైవర్షన్ ర్యాలీ’ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే... ఈ ర్యాలీకి హాజరైన ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేలా వారికి తెలియకుండా చేసిన ఏర్పాట్లే ఇందుకు నిదర్శనం.
పశ్చిమ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో శనివారం ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెరవెనుక నుంచి టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల కోసం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వారు బస్సు ఎక్కినప్పటి నుంచి కూల్‌డ్రింక్‌లు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, దూర ప్రాంతాల వారికి రాత్రి భోజనాలను కూడా అందించారు. సభ జరిగిన ప్రదేశంలో సైతం విందు భోజనాలు వడ్డించారు.
అంతటితో ఆగకుండా ర్యాలీలో రాజకీయ పార్టీలు నిర్వహించే 140 డెసిబుల్స్ సౌండ్ వచ్చే డీజే వాహనం, ఉపాధ్యాయులపై పాటల ఆడియోలు కూడా అందుబాటులోకి తెచ్చారు. చివరికి మొబైల్ టాయిలెట్లను సైతం ర్యాలీ వెంట తీసుకురావడం ఈ కార్యక్రమానికే హైలెట్. ఇవన్నీ పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఎంత పక్కా స్క్రిప్టో అర్థమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు కూడా పసుపు రంగులో ఉండడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది.
కర్నూలులో తిష్టవేసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఉపాధ్యాయుల ర్యాలీని ఎలాగైనా విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్‌గోపాల్ కర్నూలులోనే తిష్టవేశారు. శుక్రవారమే వారు కర్నూలు చేరుకుని కడప ఆర్‌జేడీ శామ్యూల్‌ను పిలిపించుకుని డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి హాజరయ్యేలా చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన అనధికారికంగా డీఈవోలు, ఎంఈవోలతో మాట్లాడి డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఈవోలు తమ పరిధిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులందరూ కచ్చితంగా కర్నూలులో ర్యాలీకి హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను కొన్నిచోట్ల ఎంఈవోలే ఏర్పాటు చేశారని సమాచారం. మరికొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. చివరికి కొన్నిచోట్ల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే ఉపాధ్యాయుల హాజరు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆరోగ్యం బాగోలేదన్నా కూడా కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో వచ్చిన ట్లు టీచర్లు చెబుతున్నారు. ఈ ర్యాలీకి టీడీపీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇవ్వడంతో డీఎస్సీ–2025కు సంబంధంలేని టీచర్లు కూడా అనేక మంది హాజరయ్యారు. వీరికి తోడు యువగళం పాదయాత్ర బృందాలు కూడా ర్యాలీలో హల్‌చల్ చేశాయి. 100 మంది వరకు టీడీపీ అనుకూల యూ ట్యూబర్లు సైతం ర్యాలీని కవర్ చేస్తూ హడావుడి చేశారు.
చంద్రబాబు, లోకేశ్ రాజకీయ వ్యూహాల్లో పావులుగా కొత్త టీచర్లు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి జెన్–జీ (యువత) పెద్ద ఎత్తున కదలివస్తోండగా నిరుద్యోగులు జేఏసీగా ఏర్పడి పోరుబాట పట్టా రు. అన్ని వైపుల నుంచి డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ కొత్తగా ఎంపికైన టీచర్లను పావులుగా చేసుకుని డీఎస్సీలో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ర్యాలీకి వ్యూహం రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


