శాంతియుత రిలే దీక్షలను అడ్డుకోవడం అప్రజాస్వావిుకం
మంత్రి లోకేశ్ రాజీనామా చేసే వరకూ పోరాటం కొనసాగుతుంది
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలకు పోలీసులు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వావిుక వైఖరికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. రిలే దీక్షలు ముగిసినా ఈనెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ–2025 అక్రమాలపై న్యాయంచేయాలని కోరుతూ గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీలేదని ఆయన చెప్పారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని.. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
కీలక అధికారులు ఎందుకు బదిలీ అయ్యారు?
అలాగే, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధంకావాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి తేల్చిచెప్పారు. అప్పట్లో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు వరుసగా ఎందుకు బదిలీ అయ్యారని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కార్యదర్శి కోన శశిధర్, పీఎస్ గిరీష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఇప్పుడా స్థానాల్లో లేరని.. స్పోర్ట్స్ కోటా, డీఎస్సీ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, శాప్ అధికారులను కూడా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. ఇక డీఎస్సీపై శాసనసభ, శాసన మండలిలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తీసుకొస్తామని.. మంత్రి లోకేశ్ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక అమరావతిలో అద్దాలు, భవనాల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని అప్పిరెడ్డి ప్రశ్నించారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: మాజీ మంత్రి సాకే శైలజానాథ్
డీఎస్సీలో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, అధికారులతో పాత వివరణలే ఇప్పిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అధికారులు ఇస్తున్న వివరణకు డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన ఉండటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ నేతలు డీఎస్సీ స్కాంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏంటని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామంటే కుదరదని, మంత్రి లోకేశ్ దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని అని అన్నారు.
యువత కోసం వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరు:వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టంచేశారు. విశాఖ నగరంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 2025 డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ టీచర్ పోస్టులను అమ్ముకుందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వీధిపోరాటాలు కొనసాగుతాయని కేకే రాజు స్పష్టంచేశారు.


