బడా సంస్థలకే ‘పుష్టి’! | Irregularities in KGBV essential goods tenders | Sakshi
Sakshi News home page

బడా సంస్థలకే ‘పుష్టి’!

Aug 9 2026 6:00 AM | Updated on Aug 9 2026 6:00 AM

Irregularities in KGBV essential goods tenders

కేజీబీవీ నిత్యావసరాల టెండర్లలో అక్రమాల మాయాజాలం  

బడా సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పలుమార్లు నిబంధనల్లో మార్పులు 

గతంలో జిల్లాల వారీగా టెండర్లు పిలవడంతో స్థానికులకు అవకాశం 

ఇప్పుడు ఐదు జోన్లుగా విభజించి నచ్చిన వారి కోసం రూ.177.95 కోట్లకు టెండర్లు 

టెండర్లు ఖరారయ్యే వరకు ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లకు పొడిగింపు ఇవ్వడం ఆనవాయితీ 

అందుకు భిన్నంగా ప్రిన్సిపాళ్లను కొనమనడంతో వారిపై అదనపు ఆర్థిక భారం 

సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులకు పుష్టికర ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇందులోనూ తన అనుయాయ బడా సంస్థలకే లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు తెరతీసింది. గతంలో ఆయా జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ పర్చేజ్‌ కమిటీ (డీపీసీ) ఆధ్వర్యంలో సరుకుల ప్రక్రియ జరిగేది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్లుగా విభజించి భారీ టెండర్లకు సర్కారు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. 

బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి, చిన్న కాంట్రాక్టర్లను పోటీ నుంచి తప్పించే యత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీబీవీలకు నిత్యావసర వస్తువులను సేకరించి, సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 177.95 కోట్లను వెచ్చించనుంది. దీనికోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లకు గతంలో ఉన్న నిబంధనలను అనేకమార్లు మార్చింది. ఇవన్నీ తన అనుయాయ బడా సంస్థల కోసమేననే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

భారీ నిధులు బొక్కేద్దాం: రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో 355 టైప్‌–3 కేజీబీవీలు పనిచేస్తున్నాయి అలాగే, ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూళ్లకు అనుబంధంగా బాలికల కోసం మొత్తం 210 టైప్‌–4 కేజీబీవీలు(బాలికల వసతిగృహాలు) కొనసాగుతున్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించి, టైప్‌–3 కేజీబీవీల రికరింగ్‌ గ్రాంటు కోసం ఏకంగా రూ. 352.11 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇందులో కేంద్ర వాటా రూ. 211 కోట్లు. టైప్‌–4 కేజీబీవీల రికరింగ్‌ గ్రాంటు కోసం రూ. 84 కోట్ల నిధులు కేటాయించగా, ఇందులో కేంద్ర వాటా రూ. 50.4 కోట్లు. కేంద్ర ప్రభుత్వ నిధులు (75:25 లేదా 60:40 నిష్పత్తిలో) వస్తున్నాయి. దీంతో ఈ నిధులను టెండర్ల పేరుతో బొక్కేసే యత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి.   

బడా సంస్థల కోసం నిబంధనలు మార్పు  
టెండర్లలో స్థానిక చిన్న వ్యాపారులు, చిరు గుత్తేదారులు పాల్గొనకుండా బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలను   అత్యంత వ్యూహాత్మకంగా మార్చారు. జోనల్‌ స్థాయిలో టెండర్లు ఆహ్వానించారు. కనీసం 20 వేల చదరపు అడుగుల సొంత, లీజు గోడౌన్‌ సదుపాయం, సరుకుల రవాణా కోసం కనీసం 20 సొంత, లీజు వాహనాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు పెట్టారు. టర్నోవర్, గత అనుభవం పేరుతో నిబంధనలను కేవలం కొన్ని పెద్ద సంస్థలకు మాత్రమే కలిసొచ్చేలా మార్చారు. 

జోనల్‌ స్థాయిలో టెండర్ల వల్ల త్వరగా పాడైపోయే పాలు, గుడ్లు వంటి వస్తువుల సరఫరాను బడా సంస్థలు స్థానికంగా చిన్న కాంట్రాక్టర్లకు సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యలో భారీ శాతం కమీషన్లు పెద్ద కంపెనీలు కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడే ఆస్కారం ఉంది. పైగా జోనల్‌ స్థాయి నుంచి సరఫరా వల్ల నాణ్యమైన సరుకులు లభించే అవకాశం ఉండదు. కేజీబీవీల్లో సిబ్బంది నాణ్యతపై ఆ కంపెనీలను ప్రశ్నించే ఆస్కారమూ లభించదు. దీనివల్ల విద్యార్థినులకు తీరని నష్టం జరుగుతుంది.   

మాకేంటి ఈ భారం : ప్రిన్సిపాల్స్‌ ఆవేదన  
ఈ టెండర్‌ ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సరుకుల పంపిణీకి పాత కాంట్రాక్టర్లకు పొడిగింపు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరగాలి. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. జూలై 30న జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆగస్టు మొదటి 15 రోజులకు అవసరమైన ప్రొవిజన్స్‌ను స్థానికంగా కొనాలని కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌కు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒక్కో పాఠశాల రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ముందుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. 

ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు, గ్యాస్, డైట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్‌ ప్రిన్సిపాళ్లపై ఈ నిర్ణయం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.. టెండర్‌ వ్యవహారం తేల్చకుండా పాఠశాలల నిర్వహణ భారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement