రాంచీలో నిరాహార దీక్షతో తీవ్ర అనారోగ్యం పాలైన నిరసనకారుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
అప్పుడే పోరాటం ఆపేస్తామని తేల్చిచెప్పిన విద్యార్థులు
జేపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై ఆరో విడత చర్చలు విఫలం
ఆ డిమాండ్‌ను అంగీకరించలేమంటున్న ప్రభుత్వం
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. జేఎస్‌ఎస్సీ–సీజీఎల్ పరీక్షలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ మినహా, 98 శాతం డిమాండ్లను అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఆదివారం జరిగిన ఆరోవిడత చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సహా చాలావరకు డిమాండ్లు నెరవేరాయని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ అన్నారు.
సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్ నెరవేరే వరకు రాజీ పడబోమని స్పష్టంచేశారు. ఆగస్టు 10న అసెంబ్లీ వరకు తలపెట్టిన ర్యాలీని కొనసాగిస్తామని ప్రకటించారు. జేఎస్‌ఎస్సీ–సీజీఎల్ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించామని, దానిపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరించలేమని సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ వెల్లడించారు. ‘‘విద్యార్థులతో మేము సానుకూల చర్చలు జరిపాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు ఆందోళనను విరమించుకోవాలా వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలి’’అని చెప్పారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా ఒక ఫాస్ట్–ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టంచేశారు.
ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం
విద్యార్థుల డిమాండ్లలో చాలావాటికి అంగీకరించామని, అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం అని జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లలో చాలావరకు తాము అంగీకరించినప్పటికీ, వారు ఆందోళనను విరమించడానికి సిద్ధంగా లేకపోవడం సరైంది కాదని అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఆందోళనను పక్కనపెట్టి, చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
పరీక్షల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విద్యార్థుల నుంచి సూచనలు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, అలాగే ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందిస్తుందని వివరించారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీకి నిరసనకారులు చేపట్టనున్న ర్యాలీ దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇప్పటికే హామీ ఇచ్చారు.
ముగ్గురు జేపీఎస్సీ సభ్యుల రాజీనామా
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ)కు చెందిన ముగ్గురు సభ్యులు అజీత భట్టాచార్య, అనీమా హన్స్‌దా, జమాల్ అహ్మద్ ఆదివారం రాజీనామా చేశారు. జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారు పదవుల నుంచి తప్పుకున్నారు. ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సహా అక్రమాల ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం ఆ ముగ్గురు సభ్యులకు సీఐడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జూలై 22న జేపీఎస్సీ చైర్‌పర్సన్ ఎల్.ఖియాంగ్టే రాజీనామా సమరి్పంచారు. ఆయనను సీఐడీ అధికారులు ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రశ్నించారు.


