నేహా బోరాపై సిరా దాడి | AISA President Neha Bora faces ink attack during Jharkhand protest rally | Sakshi
Sakshi News home page

నేహా బోరాపై సిరా దాడి

Aug 8 2026 5:33 AM | Updated on Aug 8 2026 5:33 AM

AISA President Neha Bora faces ink attack during Jharkhand protest rally

జార్ఖండ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఘటన  

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  

యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయలేరని తేల్చిచెప్పిన నేహా బోరా  

రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను దేశద్రోహి అని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆమెపై సిరా చల్లాడు. 

వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ మద్దతుదారులు, నిరసనకారులు అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తుండగా బిర్సా చౌక్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సిరా చల్లిన వ్యక్తిని అమర్‌నాథ్‌ పాండేగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశి్నస్తున్నారు. అయితే, ఇప్పటివరకు అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఈ సిరా దాడి ఒక నాటకమేనని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో భాగమైన సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌కు ఏఐఎస్‌ఏ విద్యార్థి విభాగమని గుర్తుచేసింది.  

ఉద్యమాన్ని బలహీనపర్చడానికి కుట్రలు  
తాజా సంఘటనపై నేహా బోరా స్పందించారు. ఢిల్లీలో నిరసనల సమయంలో పెల్లెట్‌ గన్‌ కాల్పులు, లాఠీచార్జిని ఎదుర్కొన్న తనకు ఈ సిరా దాడి వల్ల ఎలాంటి భయం కలగదని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయగలరా? అని ప్రశ్నించారు. ఉద్యమాన్ని బలహీనపర్చడానికి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు కుట్రలు సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా హింసకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారితీసిన ఢిల్లీ ఉద్యమంలో తాను భాగమైనందుకే ప్రతీకార చర్యగా బీజేపీ ఈ ఘటనకు పాల్పడిందని నేహా బోరా ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా జనసందోహం మధ్య నుంచి ఒక్కసారిగా ఒక వ్యక్తి బయటకు వచ్చి బోరాపై సిరా విసిరాడని ఏఐఎస్‌ఏ నాయకురాలు శివాని పేర్కొన్నారు. నిందితుడికి బీజేపీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నేహా బోరా దేశ వ్యతిరేకి అని నిందితుడు అమర్‌నాథ్‌ పాండే మండిపడ్డాడు. ఆమె ఉమర్‌ ఖలీద్‌ మద్దతుదారు అని ధ్వజమెత్తాడు.  

ఆసుపత్రికి రాహుల్‌ క్రాంతి తరలింపు  
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆరుగురు నిరసనకారుల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలిసింది. వారిలో రాహుల్‌ క్రాంతి అనే విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాంచీలోని సదర్‌ ఆసుపత్రిలో చేర్చినట్లు ఒక అధికారి తెలిపారు. రాహుల్‌ క్రాంతి మంగళవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్‌ మరాండి ఆరా తీశారు. 


మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల నిరసన శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. రెండు విద్యార్థి సంఘాలు రాష్ట్ర అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాయి. నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని డిమాండ్‌ చేశాయి. 14వ జేపీఎస్సీ సివిల్‌ సరీ్వసెస్‌ పరీక్షను రద్దు చేయాలని, అవకతవకలపై సీబీఐ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల బృందం చేత స్వతంత్ర విచారణ జరిపించాలని తేల్చిచెప్పాయి.   

ప్రభుత్వంతో తొలి విడత చర్చలు  
ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలపై జార్ఖండ్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆందోళనను కొనసాగిస్తామని నిరసనకారులు తేల్చిచెప్పారు. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతోసహా తమ డిమాండ్లన్నీ నెరవేర్చే వరకూ ఆందోళనను విరమించబోమని పేర్కొన్నారు. ఆదివారం నాటికి తమ డిమాండ్లు నెరవేరకపోతే, ఆగస్టు 10న రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జేపీఎస్సీ/జేఎస్‌ఎస్సీ సంస్కరణల మంచ్‌కు చెందిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి మధ్య శుక్రవారం రాత్రి మొదటి విడత చర్చలు జరిగాయి. జార్ఖండ్‌ ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, తమ డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంస్కరణల మంచ్‌ నాయకులు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement