అమిత్ షా సభకు రావాలని ప్రతిపక్షాల డిమాండ్
అయోధ్య రామాలయ విరాళాల చోరీపై చర్చించాలని పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావే శాల్లో వాయిదాల పర్వం ఆగడం లేదు. విపక్షాల ఆందోళనల కారణంగా చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. కార్యకలాపాలేవీ సాగకుండానే ఉభయ సభలు తరచుగా వాయిదా పడుతున్నాయి. శుక్రవారం సైతం అదే దృశ్యం ఆవిష్కృతమైంది.
ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అయోధ్య రామాలయ విరాళాల చోరీ సహా కీలక అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి.
గాంధీ నుంచి స్ఫూర్తి పొందండి
లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా స్పీకర్ ఓంబిర్లా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆదర్శాలు, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలు నిరసనకు దిగడంతో స్పీకర్ తీవ్రంగా స్పందించారు.
జాతిపిత గాంధీజీ స్ఫూర్తిని దేశ విదేశాలు అనుసరిస్తున్నాయని, అదే స్ఫూర్తిని మన సభలో కనబరచాలని సభ్యులకు సూచించారు. అనంతరం నీట్ పేపర్ లీక్‌పై లోక్‌సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. విద్యార్థుల నిరసనల పట్ల పోలీసుల దమనకాండపై హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. నినాదాలతో హోరెత్తించాయి. దాంతో వాయిదాల పర్వం కొనసాగి చివరకు సోమవారానికి వాయిదా పడింది.
రాజ్యసభలో నినాదాల హోరు
హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ పదేపదే అంతరాయం కలిగించడంతో కార్యకలాపాలు స్తంభించాయి. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. అయినప్పటికీ ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేయడం చేయడంతోపాటు రామమందిర విరాళాల చోరీ అంశాన్ని లేవనె త్తారు. దాంతో అధికారపక్ష సభ్యులు ఎదురు దాడికి దిగారు. గందరగోళం కొనసాగుతుండగా చైర్మన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు.
అమిత్ షా వస్తే తట్టుకోలేరు: కిరణ్ రిజిజు
దేశాన్ని అస్థిరపరచాలని చూసే ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం హోంమంత్రి అమిత్ షా పేరు చెబితే భయంతో వణికిపోతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అలాంటి నాయకుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఏ మంత్రి సభలో సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం, సభాపతి నిర్ణయిస్తారని స్పష్టంచేశారు.
హోంమంత్రి సభకు రావాలంటూ సభాపతి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని అన్నారు. విపక్ష ఎంపీలు ఉదయం 11 గంటల తర్వాత సభను వదిలి వెళ్లిపోతున్నారని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉంటున్నారని గుర్తుచేశారు. హోంమంత్రి సభలో సమాధానం చెప్పే సమయం వచ్చినప్పుడు, ఆయన చర్చలో పాల్గొన్నప్పుడు వినడానికి విపక్ష ఎంపీలు సభలో ఉండరని ఆక్షేపించారు. అమిత్ షా వస్తే తట్టుకోలేక వెళ్లిపోతారని అన్నారు.


