breaking news
Family responsibility
-
ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..
పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ‘రిటైర్ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్‌లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తూ, పెయింటింగ్స్ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే... ‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా. బాధ్యతల బరువు నుంచి.. ఫైటర్ పైలట్‌ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది. అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్‌కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్‌పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్‌గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది. ఆలోచింప జేసిన జీవనం వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్స్టాగ్రామ్ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్నెస్ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది. మార్చిన అవకాశం తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవడంతో ముక్తాసింగ్ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్ ముక్తాని తన డ్రెస్‌లకు మోడలింగ్ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది. ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్‌మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేస్తుంది. వారిలో స్టీవ్ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్..ల చిత్రాలు ఉన్నాయి. ‘ఎన్ని పనులున్నా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్ మాటలు రిటైర్మెంట్ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి. -
కడుపు కోతలు మహిళలకేనా..?
* కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మహిళలదే అగ్రస్థానం * వెసెక్టమీకి ఆసక్తి చూపని పురుషులు * అవగహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు నల్లగొండ టౌన్: కుటుంబం బాధ్యత భార్యాభర్తలిద్దరిది. అలాగే కుటుంబ నియంత్రణలో కూడా మహిళలతో పాటు పురుషుల బాధ్యత కూడా ఉంది. కానీ కుటుంబ నియంత్రణ అనగానే వైద్య ఆరోగ్యశాఖతో పాటు కుటుంబ సభ్యులకు గుర్తు వచ్చేది మహిళలే. కుటుంబ నియంత్రణ కోసం పురుషులకు వెసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీతో పాటు డీపీఎల్ ఆపరేషన్లు చేస్తుంటారు. అయినా వెసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు ముందుకు రావడం లేదు. జిల్లాలో 2010 నుంచి 2014 అక్టోబర్ వరకు 1,16,707 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే కేవలం 368 మంది పురుషులు మాత్రమే వెసెక్టమీ చేయించుకున్నారు. దీనిని బట్టే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలో పురుషులు మహిళల పట్ల ఎంత వివక్షత చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అపోహలతో అనాసక్తి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలకంటే పురుషులకు చేయడం ఎంతో సులభం..సురక్షితం. కానీ పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిం చుకుంటే కష్టం చేయడానకి ఇబ్బందులు ఏర్పాడతాయని, సంసారజీవితానికి కూడా ఆటంకం కలుగుతుందనే అపోహ, మూఢ నమ్మకాలు ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. దీంతో మహిళలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం పరిపాటిగా మారింది. అయితే వెసెక్టమీ చేయించుకున్న పురుషుడు అదే రోజు తన రోజువారి పనులను యథావిధిగా చేసుకోవచ్చు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే కనీసం ఇరువై రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అవగాహన కల్పించడంలో విఫలం వెసెక్టమీ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. వెసెక్టమీపై ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ముందుకు రావడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం క్షేత్ర స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మహిళలనే ప్రోత్సహిస్తున్నారే తప్ప వెసెక్టమీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.