భారత విజ్ఞానం
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.
సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.
సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.
కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.
– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు


