ఫండే
స్నాక్ సెంటర్
రోజూ చేసే వంటలతో బోర్ కొట్టిందా? అయితే కాస్త వెరైటీగా, రుచిగా ఉండే ఈ నాలుగు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. క్రిస్పీ ఆలూ సూజీ పూరీ నుంచి నోరూరించే భర్వాన్ కరేలా వరకు.. ఒక్కో వంటకం ఒక్కో ప్రత్యేక రుచిని అందిస్తుంది.
క్రిస్పీ ఆలూ సూజీ పూరీ
కావలసినవి..
బంగాళాదుంపలు: 2,
సూజీ రవ్వ: కప్పు,
గోధుమపిండి: అర కప్పు,
పచ్చిమిర్చి: 2,
కొత్తిమీర: కొద్దిగా,
కారం: హాఫ్ టీస్పూన్,
జీలకర్ర: హాఫ్ టీస్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: వేయించడానికి.
తయారీ..
- ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి, రవ్వ, గోధుమపిండి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి.
- కొద్దికొద్దిగా నీరు పోస్తూ గట్టిగా పిండిని కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి.
- చిన్న ఉండలు చేసి పూరీల్లా ఒత్తాలి.
- వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- వేడివేడిగా ఆలూ కర్రీ లేదా పెరుగుతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
ఖర్ వాంగ్..
కావలసినవి..
వంకాయలు: 6,
వేరుశెనగలు: అర కప్పు,
నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు,
ధనియాలు: టేబుల్ స్పూన్,
జీలకర్ర: టీస్పూన్,
పచ్చిమిర్చి: 2,
వెల్లుల్లి: 5 రెబ్బలు,
అల్లం: చిన్న ముక్క,
ఎండుకొబ్బరి: కొద్దిగా,
ఉప్పు, పసుపు,
కారం: తగినంత,
నూనె: 2 టేబుల్‌స్పూన్లు.
తయారీ..
- వేరుశెనగలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొబ్బరిని వేయించి పొడిగా చేసుకోవాలి.
- వంకాయలను మధ్యలో చీల్చి ఈ మసాలాను నింపాలి.
- బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వంకాయలను జాగ్రత్తగా ఉంచాలి.
- కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి.
- చివర్లో మిగిలిన మసాలా, ఉప్పు, కారం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే మంచి రుచితో ఖర్ వాంగ్ సిద్ధం.
ఆలూ కుల్ఫీ సమోసా
కావలసినవి..
సమోసా షీట్లు: 6,
ఉడికించిన బంగాళాదుంపలు: 2,
పచ్చిమిర్చి: 2,
కొత్తిమీర: కొద్దిగా,
కారం: హాఫ్ టీస్పూన్,
గరం మసాలా: హాఫ్ టీస్పూన్,
జీలకర్ర: హాఫ్ టీస్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: వేయించడానికి.
తయారీ..
- ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు కలపాలి.
- సమోసా షీట్‌ను కుల్ఫీ ఆకారంలో చేసి, ఆలూ మిశ్రమాన్ని నింపి అంచులను చక్కగా మూసివేయాలి.
- వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- అంతే వేడివేడి ఆలూ కుల్ఫీ సమోసా రెడీ! వీటిని టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే రుచికరంగా ఉంటాయి.
భర్వాన్ కరేలా..
కావలసినవి..
కాకరకాయలు: 5,
ఉల్లిపాయలు: 2,
వేరుశెనగ పొడి: 2 టేబుల్‌స్పూన్లు,
ధనియాల పొడి: టీస్పూన్,
కారం: టీస్పూన్,
పసుపు: కొద్దిగా,
ఆమ్చూర్ పొడి: హాఫ్ టీస్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: 2 టేబుల్‌స్పూన్లు.
తయారీ..
- కాకరకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో చీల్చి గింజలు తీసేయాలి.
- ఉల్లిపాయలు, వేరుశెనగ పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఆమ్చూర్, ఉప్పు కలిపి మసాలా సిద్ధం చేసుకోవాలి.
- ఈ మసాలాను కాకరకాయల్లో నింపాలి.
- బాణలిలో నూనె వేడి చేసి కాకరకాయలను వేసి మూతపెట్టి తక్కువ మంటపై మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- మధ్యమధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే రుచికరమైన భర్వాన్ కరేలా సిద్ధం.
ఇదీ చదవండి: సూపర్‌మార్కెట్‌లో కూరగాయలపై నీళ్లు ఎందుకు చల్లుతారో తెలుసా?


