జరాసంధ వధ | Bhima Slays Jarasandha in Mahabharatam | Sakshi
Sakshi News home page

జరాసంధ వధ

Oct 26 2026 12:35 AM | Updated on Oct 26 2026 12:35 AM

Bhima Slays Jarasandha in Mahabharatam

భారత విజ్ఞానం

జరాసంధుని పుట్టుక ఎంతో విచిత్రం. రెండు సగాలుగా పుట్టిన మగధ రాజకుమారుడు. ‘జర ’అనే రాక్షసి ఆ రెండు సగ భాగాలను సంధించగా అంటే కలపగా జరాసంధుడయ్యాడు. మహాభారతంలో జరాసంధ వధ ఒక కీలక ఘట్టమే.

జరాసంధుడు మగధ రాజ్యాన్ని ఏలిన బృహద్రథుని కుమారుడు. బృహద్రథునికి ఇరువురు భార్యలు. ఇరువురు భార్యలను అన్నింటా సమానంగా చూడాలని బృహద్రథుడి నియమం. అయితే ఇరువురి వల్లా సంతానం కలగ లేదు. దాంతో బృహద్రథుడు తన రాజ్యానికి వచ్చిన చండకౌశికుడు అనే మునికి సపర్యలు చేశాడు. ఆ ముని సంతోషించి ఏదైనా వరం కోరుకోమనగానే సంతాన భాగ్యాన్ని కల్పించమని కోరుకున్నాడు.

 చండకౌశిక ముని ఒక మామిడిపండును అభిమంత్రించి ఇచ్చాడు. బృహద్రథుడు ఆ పండును రెండు సగాలు చేసి భార్యలకు ఇచ్చాడు. వారిద్దరూ కలసి ఆ పండు తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; బదులుగా రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి. తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. 

కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు.  

జరాసంధుడు మహా బలశాలి, శివ భక్తుడు కూడా. భైరవునికి నరబలి ఇచ్చేందుకు 86 మంది రాజులను తన చెరసాలలో బంధించాడు. కాగా తన అల్లుడైన కంసుడిని శ్రీృష్ణుడు వధించడంతో అతనిపై కక్ష పెంచుకొని మధురపై పలుమార్లు దండయాత్రలు చేశాడు జరాసంధుడు.

రాజసూయ యాగం తలపెట్టిన ధర్మరాజుకు అడ్డంకిగా ఉన్న జరాసంధుడిని అంతం చేసేందుకు శ్రీ కృష్ణుడు ఒక ఉపాయం ఆచరణ చేశాడు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు మారువేషాల్లో వెళ్లి, మల్ల యుద్ధాన్ని కోరుకునే జరాసంధుడిని యుద్ధానికి రమ్మని ఆహ్వానించారు. భీమునికి, జరాసంధునికి సుమారు 28 రోజులు భీకరమైన మల్లయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జరాసంధుని ఎన్నిసార్లు సంహరించినా ఆ భాగాలు తిరిగి అతుక్కుని మరల రెట్టించిన బలంతో భీముని మీదికి రాసాగాడు జరాసంధుడు. 

ఈ నేపథ్యంలో జరాసంధుడిని వధించేందుకు శ్రీ కృష్ణుడు భీముని చూసి ఒక రహస్య సౌంజ్ఞ చేశాడు. ఒక గడ్డిపోచను తీసుకొని నిలువునా చీల్చి వ్యతిరేక దిశలో పడవేశాడు. దీనిని అర్థం చేసుకున్న భీముడు జరాసంధుని నిలువునా చీల్చి రెండు సగభాగాలను వ్యతిరేక దిశలో పడవేయడంతో జరాసంధుడు మరణించాడు. ఆ విధంగా జరాసంధ వధ జరిగింది. 

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement