breaking news
Wrestling match
-
జరాసంధ వధ
జరాసంధుని పుట్టుక ఎంతో విచిత్రం. రెండు సగాలుగా పుట్టిన మగధ రాజకుమారుడు. ‘జర ’అనే రాక్షసి ఆ రెండు సగ భాగాలను సంధించగా అంటే కలపగా జరాసంధుడయ్యాడు. మహాభారతంలో జరాసంధ వధ ఒక కీలక ఘట్టమే.జరాసంధుడు మగధ రాజ్యాన్ని ఏలిన బృహద్రథుని కుమారుడు. బృహద్రథునికి ఇరువురు భార్యలు. ఇరువురు భార్యలను అన్నింటా సమానంగా చూడాలని బృహద్రథుడి నియమం. అయితే ఇరువురి వల్లా సంతానం కలగ లేదు. దాంతో బృహద్రథుడు తన రాజ్యానికి వచ్చిన చండకౌశికుడు అనే మునికి సపర్యలు చేశాడు. ఆ ముని సంతోషించి ఏదైనా వరం కోరుకోమనగానే సంతాన భాగ్యాన్ని కల్పించమని కోరుకున్నాడు. చండకౌశిక ముని ఒక మామిడిపండును అభిమంత్రించి ఇచ్చాడు. బృహద్రథుడు ఆ పండును రెండు సగాలు చేసి భార్యలకు ఇచ్చాడు. వారిద్దరూ కలసి ఆ పండు తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; బదులుగా రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి. తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు. జరాసంధుడు మహా బలశాలి, శివ భక్తుడు కూడా. భైరవునికి నరబలి ఇచ్చేందుకు 86 మంది రాజులను తన చెరసాలలో బంధించాడు. కాగా తన అల్లుడైన కంసుడిని శ్రీృష్ణుడు వధించడంతో అతనిపై కక్ష పెంచుకొని మధురపై పలుమార్లు దండయాత్రలు చేశాడు జరాసంధుడు.రాజసూయ యాగం తలపెట్టిన ధర్మరాజుకు అడ్డంకిగా ఉన్న జరాసంధుడిని అంతం చేసేందుకు శ్రీ కృష్ణుడు ఒక ఉపాయం ఆచరణ చేశాడు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు మారువేషాల్లో వెళ్లి, మల్ల యుద్ధాన్ని కోరుకునే జరాసంధుడిని యుద్ధానికి రమ్మని ఆహ్వానించారు. భీమునికి, జరాసంధునికి సుమారు 28 రోజులు భీకరమైన మల్లయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జరాసంధుని ఎన్నిసార్లు సంహరించినా ఆ భాగాలు తిరిగి అతుక్కుని మరల రెట్టించిన బలంతో భీముని మీదికి రాసాగాడు జరాసంధుడు. ఈ నేపథ్యంలో జరాసంధుడిని వధించేందుకు శ్రీ కృష్ణుడు భీముని చూసి ఒక రహస్య సౌంజ్ఞ చేశాడు. ఒక గడ్డిపోచను తీసుకొని నిలువునా చీల్చి వ్యతిరేక దిశలో పడవేశాడు. దీనిని అర్థం చేసుకున్న భీముడు జరాసంధుని నిలువునా చీల్చి రెండు సగభాగాలను వ్యతిరేక దిశలో పడవేయడంతో జరాసంధుడు మరణించాడు. ఆ విధంగా జరాసంధ వధ జరిగింది. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ఆ అమ్మాయికి.. ఈ అబ్బాయి దొరికితే ఒ(ప)ట్టు
-
ఆ అమ్మాయికి.. ఈ అబ్బాయి దొరికితే ఒ(ప)ట్టు
వాషింగ్టన్: అమెరికాలోని ఒహియోలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన రెజ్లంగ్ మ్యాచ్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో తమాషాగా, సరదాగా, ఆసక్తికరంగా ఉంది. ఐజయ్య లినెబెర్రీ అనే నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్ల అమ్మాయి మధ్య కుస్తీ పోటీ నిర్వహించారు. లినెబెర్రీ రెజ్లింగ్ టోర్నమెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా.. ఈ మ్యాచ్ రెండోది. ఇద్దరి మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. అక్కడున్నవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ అమ్మాయి పోరాటానికి సిద్ధం కాగా.. లినెబెర్రీ మాత్రం ఫైటింగ్ చేయకుండా పరిగెత్తాడు. ఆ అమ్మాయి వెంటపడగా.. మ్యాచ్‌లో చాలాసేపు దొరకకుండా సర్కిల్లో పరుగులు తీశాడు. రెండో రౌండ్లో ఆ అమ్మాయి లినెబెర్రీని ఓ పట్టు పట్టింది. ఇంతలోనే అతను తప్పించుకుని మళ్లీ పరుగులు పెట్టాడు. మ్యాచ్ అనంతరం ఎందుకు పరిగెత్తావు అని ఐజయ్యను తల్లి ప్రశ్నించగా.. 'నాకు తెలియదు మమ్మీ, తమాషాగా ఉంది' అని సమాధానం చెప్పాడు. గతేడాది డిసెంబర్ లో ఈ టోర్నమెంట్ జరగగా, ఈ వీడియోను ఇటీవల ఆన్లైన్లో పోస్ట్ చేశారు. -
ఏర్పాట్లలో నిర్లక్ష్యం... ప్రాక్టీస్‌లో యువ రెజ్లర్ మృతి
పుణే: నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువ రెజ్లర్‌ను బలి తీసుకుంది. నిర్ణీత ప్రమాణాల్లేని ఫ్లోర్‌పై ప్రాక్టీస్ పోటీల సందర్భంగా 19 ఏళ్ల వికాస్ బాలు సస్థే మృతి చెందాడు. ఇక్కడి జమాలీ గ్రామానికి చెందిన అతను త్వరలో ముంబైలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల కోసం సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాడు. మంగల్వార్ పేఠ్ గ్రౌండ్లో ఎర్రటి ఎండలో ఏర్పాటు చేసిన నాసిరకపు ఫ్లోర్‌పై శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా అతని వెన్నెముకకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు. వెన్నెముక గాయంతో పాటు మెదడు, గుండె పోటుతో అతను మృతి చెందాడని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. సిమెంట్ బెడ్‌తో ఏర్పాటు చేసిన ఈ ఫ్లోర్‌పై కుషన్‌లాంటి మ్యాట్లను కాకుండా ప్లాస్టిక్ మ్యాట్లను వాడటం వల్లే అతను గాయపడినట్లు విచారణలో తేలింది. ఎండ వేడిమికి ప్లాస్టిక్ మ్యాట్లు కరగడంతో అతని వీపు బలంగా సిమెంట్ బెడ్‌కు తాకడం వల్లే వికాస్ మృతి చెందాడు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కూడా అందుబాటులో ఉంచకుండా ట్రయల్స్ జరపడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.


