లక్ష్య సాధన... మత్స్యయంత్ర ఛేదన | Key Takeaways for Achieving Any Goal | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధన... మత్స్యయంత్ర ఛేదన

Nov 30 2026 4:18 AM | Updated on Nov 30 2026 4:18 AM

Key Takeaways for Achieving Any Goal

భారత విజ్ఞానం

ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తే విజయాన్ని సొంతం చేసుకొని లక్ష్యాన్ని సాధించ వచ్చు. ఈ విషయం అలనాటి ద్వాపర యుగంలో జరిగిన ద్రౌపది స్వయంవరంలో కూడా ఋజువయ్యింది. పైన తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని కింద ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో తిరుగుతున్న ఆ చేప ప్రతి బింబాన్ని చూసి చేప కంటి భాగాన్ని కొట్టాలి. 

అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించడం వెనుక కేవలం బలమే కాదు... నిరంతర సాధన, అపారమైన ఆత్మవిశ్వాసం, లక్ష్యంపై చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్నాయి. ఇంతకీ మత్స్యయంత్రాన్ని ఎందుకు? ఎవరు? ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాంచాలదేశపు రాజు ద్రుపదుడు పాండవ మధ్యముడైన అర్జునుడిని తన అల్లుడిగా పొందాలనే కోరికతో మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే... కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడు పాండవుల సాయంతో ద్రుపదుడిని ఓడించి, అతని రాజ్యంలో సగభాగాన్ని హస్తగతం చేసుకున్నాడు.

 ఆ అవమానానికి ప్రతీకారంగా, ద్రోణుడిని వధించే కుమారుడు ధృష్టద్యుమ్నుడు, అర్జునుడిని వివాహం చేసుకునే కుమార్తె ద్రౌపది కోసం ద్రుపదుడు యజ్ఞం చేశాడు. అర్జునుడి పరాక్రమంపై ఎంతో నమ్మకం ఉన్న ద్రుపదుడు, తనకు అండగా, ద్రోణుడి శిష్యుడైన అర్జునుడు మాత్రమే నిలబడగలడని  భావించాడు. 

లక్క ఇంటి ప్రమాదంలో పాండవులు చనిపోయారని అందరూ అనుకున్నారు, కానీ వారు బతికే ఉన్నారని ద్రుపదుడు గట్టిగా నమ్మాడు. 

ద్రౌపదికి సరైన వరుడిని గుర్తించడం కోసం, పాండవులు అజ్ఞాతవాసంలో (బ్రాహ్మణ వేషాలలో) ఉన్నందున, వారిని బయటకు రప్పించడానికి, కేవలం అర్జునుడి వంటి అసాధారణ విలుకాడు మాత్రమే ఛేదించగలిగే కఠినమైన పరీక్షగా ఈ మత్స్య యంత్రాన్ని రూపొందించారు.

 ద్రుపదుడు, ఊహించినట్లుగానే, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకొని ద్రుపదుని లక్ష్యాన్ని కూడా నెరవేర్చాడు. అలనాటి మత్స్య యంత్రచ్ఛేదన నేటి ప్రవేశ సరీక్ష లాంటిదని చెప్పుకోవచ్చు.

లక్ష్యం ఎంత కష్టమైనదైనా పట్టుదలతో సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మన దృష్టి లక్ష్యంపై ఉంటే విజయం మనల్నే వరిస్తుంది. సాధన, సంయమనం, ఏకాగ్రత ఉన్నవారికి అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ‘చూపు లక్ష్యంపై ఉండాలి. ఆలోచన విజయం వైపు సాగాలి. సంకల్పం బలంగా ఉంటే అసాధ్యమైన లక్ష్యం కూడా సుసాధ్యమవుతుంది. అర్జునుడి మత్స్య యంత్ర ఛేదనం తరతరాలకు ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యసాధనకు చిరస్మరణీయమైన ఉదాహరణగా నిలిచిపోతుంది.

– సి.ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement