మంచిమాట
మనం నిత్యజీవితంలో ఆనందం కోసం నిరంతరం పరిగెత్తుతుంటాము. కొత్త బట్టలు కొన్నప్పుడు, పరీక్షలో ఉత్తీర్ణులైనప్పుడు, కుటుంబ సభ్యులతో కలిసినప్పుడు లేదా పండుగలు వచ్చినప్పుడు కలిగే సంతోషాన్ని మనం ‘ఆనందం’ అని పిలుస్తుంటాము. కానీ, ఆధ్యాత్మిక దృష్టిలో ఆనందానికి, ఉల్లాసానికి మధ్య గొప్ప వ్యత్యాసం ఉంది.
బయటి వస్తువుల వల్ల, పరిస్థితుల వల్ల కలిగేది ఉల్లాసం లేదా సుఖం. అది తాత్కాలికమైనది. పరిస్థితి మారగానే ఆ ఉల్లాసం కూడా మారిపోతుంది. కానీ, లోపలి నుండి పుట్టేది, ఎటువంటి కారణం లేకుండానే హృదయాన్ని నింపేది నిజమైన ఆనందం. భారతీయ తత్త్వశాస్త్రంలో పరమాత్మ స్వరూపాన్ని ‘సచ్చిదానందం’ (సత్ + చిత్ + ఆనందం) అని వర్ణించారు. అంటే భగవంతుడు లేదా సత్యం కేవలం జ్ఞానం మాత్రమే కాదు, అది స్వచ్ఛమైన ఆనందం కూడా.
‘ఉత్సవం’ అనే పదానికి మూలార్థం అంటే ‘ఉత్’ పైకి లేవడం, ఉన్నత స్థితికి చేరడం... ‘సవం’ అంటే కలవడంం ఐక్యం కావడం. కాబట్టి, ఆధ్యాత్మిక ఆనందోత్సవం అంటే నృత్యాలు చేయడమే కాదు. మనలోని సాధారణ చైతన్యాన్ని ఉన్నతమైన ఆత్మచైతన్యం వైపు, భగవంతుని వైపు తీసుకెళ్లడమే నిజమైన ఉత్సవం. ఉపనిషత్తులు ఆనందాన్ని ఒక అనుభూతిగా కాకుండా, విశ్వానికి మూలమైన సత్యంగా చెబుతాయి.
చేసే సాధన, ధ్యానం, జపం, పూజ లేదా సేవ అంతిమంగా ఈ ఆనందాన్ని అనుభూతి చెందడానికే. ఆనందం లేని ఆధ్యాత్మికత బిగుతుగా, బరువుగా ఉంటుంది. ఆనందంతో కూడిన ఆధ్యాత్మికత తేలికగా, సహజంగా, ప్రేమపూర్ణమై ఉంటుంది. మన అంతరంగంలో ఆనందం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నా, మనకు ఎందుకు దుఃఖం లేదా అసంతృప్తి కలుగుతుంది? దీనికి ఆధ్యాత్మికత ఇచ్చే సమాధానం చాలా స్పష్టమైనది. మనసులోని అజ్ఞానం అహంభావం.
‘నేను – నాది’ అనే భావన పెరిగిన కొద్దీ, ఆ వస్తువులు లేదా వ్యక్తులు దూరమైనప్పుడు లేదా మనకు అనుకూలంగా లేనప్పుడు దుఃఖం కలుగుతుంది. ఒక కోరిక తీరగానే మరో పది కోరికలు పుడతాయి. కోరికలు తీరని ఆశగా మిగిలిపోయినప్పుడు మనసులో అశాంతి నెలకొంటుంది. గతం పట్ల పశ్చాత్తాపం లేదా భవిష్యత్తు పట్ల ఆందోళన మనల్ని ప్రస్తుత క్షణంలోని ఆనందాన్ని చూడనివ్వకుండా చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ బరువులను కొద్దికొద్దిగా దించుకుంటామో, అప్పుడే లోపల దాగి ఉన్న ఆనందపు ఊట బయటకు వస్తుంది.
ఫలాపేక్ష లేకుండా చేసే సేవ మనసులోని అహాన్ని కరిగిస్తుంది. ఇతరుల ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు, వారి కష్టాన్ని తీర్చినప్పుడు కలిగే తృప్తి్త అత్యంత పవిత్రమైన ఆనందం. రోజులో కొంత సమయం బాహ్య శబ్దాలకు, ఆలోచనల ప్రవాహానికి దూరంగా మౌనంగా కూర్చున్నప్పుడు మన అసలు స్వరూపం మనకు కనిపిస్తుంది. ధ్యానంలో మనసు నిశ్చలమైనప్పుడు, ఎటువంటి కారణం లేని నిర్మలమైన ఆనందం అనుభవమవుతుంది.
ఆనందం ఎక్కడో దాగి లేదు. అది మన హృదయపు తలుపు తడుతోంది. అహాన్ని పక్కన పెట్టి, ప్రేమను, కరుణను, కృతజ్ఞతను మనసులో నింపుకుంటే, మన జీవితమే ఒక నిరంతర ఆనందోత్సవంగా వికసిస్తుంది.
ఆధ్యాత్మికతలో ఆనందాన్ని చేరుకోవడానికి వేర్వేరు స్వభావాలకు అనుగుణంగా అనేక మార్గాలు ఉన్నాయి. భగవంతుడిని దూరంగా ఉన్న శక్తిగా కాకుండా, అత్యంత సన్నిహితుడిగా, మిత్రుడిగా, తల్లిదండ్రులు గా భక్తిలో భావిస్తారు. నామస్మరణ, కీర్తనలు, పూజ ద్వారా హృదయం నిర్మలమవుతుంది. ప్రేమ పారవశ్యంలో మనం మనల్ని మనం మర్చిపోయినప్పుడు కలిగే స్థితే ఒక గొప్ప ఆనందోత్సవం. ‘నేను శరీరాన్ని కాదు, మనసును కాదు నేను శాశ్వతమైన ఆత్మన’నే వివేకం కలిగినప్పుడు, బాహ్య పరిస్థితుల ప్రభావం తగ్గుతుంది. సత్యదర్శనంలో కలిగే ప్రశాంతత, స్పష్టత ఒక అచంచలమైన ఆనందాన్ని ఇస్తాయి.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి


