సమగ్ర విచారణకు టెన్నసీ గవర్నర్ ఆదేశం
నాషవిల్లే: హత్య కేసులో పడిన శిక్షను అమలు చేసే క్రమంలో చావుతప్పిన క్రిస్టా పైక్ పరిస్థితి మెరుగవుతోంది. రెండు విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా మరణించకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. చికిత్స తరువాత యాభై ఏళ్ల క్రిస్టా స్పృహలోకి వచ్చింది. మరణశిక్ష అమల్లో జరిగిన పొరబాట్లపై మరింత సమాచారం కోరుతూ క్రిస్టా తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
1995లో క్లాస్‌మేట్ కొలీన్ స్లెమ్మర్‌ను కత్తితో పొడిచి చంపిన నేరానికి గాను క్రిస్టాకు మరణశిక్ష పడింది. వాయిదాలు, అప్పీళ్ల తరువాత గత నెల 30న శిక్ష అమలుకు తీర్మానించారు. ఇందులో భాగంగా పెంటోబార్బిటాల్ అనే విషపు ఇంజెక్షన్లు ఒకదాని తరువాత ఒకటి ఇచ్చారు. అయినాసరే.. ఆమె మరణించకపోగా... గురకపెడుతూ కనిపించింది. ఇలా విషానికి లొంగని ఒకే ఒక వ్యక్తి క్రిస్టానేని అంటున్నారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో క్రిస్టా మళ్లీ స్పృహలోకి వచ్చారు. మాట్లాడుతున్నారు.
వైద్యం అందుతోంది’’ అని ఆమె తరఫు న్యాయవదులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పట్టవచ్చునని వారు చెప్పారు. క్రిస్టా చేతులు కాలిపోయి బొబ్బలెక్కాయని తెలిపారు. మరణశిక్ష ఎందుకు విఫలమైందన్న విషయంపై విచారించేందుకు వీలుగా క్రిస్టాకు ఇచ్చిన మందుల వివరాలన్నీ భద్రపరచాలని కోరుతూ వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఇదే అంశంపై టెన్నసీ గవర్నర్ బిల్‌లీ సమగ్రమైన విచారణకు ఆదేశించడం గమనార్హం. విషపు ఇంజెక్షన్ ఆమె రక్తంలోకి కాకుండా... చర్మం పైపొరలోని కణజాలంలోకి చేరడం వల్లనే ఆమె మరణించకుండా ఉంటుందని నిపుణులు కొందరు అభిప్రాయపడ్డారు.


