ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెర..
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి పోటెత్తుతున్న భక్తజనం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఒక ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం కొండగట్టు అంజన్న తన అసలు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ మహాద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు కొండగట్టుకు తరలివస్తున్నారు.
కలలో సాక్షాత్కారం
సుమారు 400 నుండి 500 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ క్షేత్రానికి త్రేతాయుగంతో అనుబంధం ఉందని స్థలపురాణం చెబుతోంది. రామరావణ యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకెళ్తున్న సమయంలో, అందులోంచి ఒక భాగం విరిగి ఇక్కడ పడిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాలక్రమేణా, సుమారు 400 ఏళ్ల క్రితం సింగం సంజీవుడు అనే గోరక్షకుడి కలలో స్వామివారు సాక్షాత్కరించి తన ఉనికిని తెలియజేశారని, ఆ తర్వాతే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. దాదాపు 150 ఏళ్ల క్రితం కృష్ణారావు అనే స్థానిక దేశ్‌ముఖ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, పూజాది కార్యక్రమాలను విస్తృతపరిచినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
60 ఏళ్ల ఔచిత్యం ఆలయ సంప్రదాయం ప్రకారం, ప్రతి మంగళ, శనివారాల్లో మూలవిరాట్టుకు భక్తులు, అర్చకులు చందనం, సింధూరం పూస్తారు. ఇలా దశాబ్దాల తరబడి నిరంతరాయంగా పూయడం వల్ల స్వయంభువు విగ్రహంపై మందపాటి కవచంలా పొరలు ఏర్పడి, స్వామివారి నిజరూపం మరుగున పడిపోతుంది.
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, భక్తులకు స్వామివారి అసలు రూపాన్ని దర్శింపజేయడం కోసం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ చందన, సింధూర పొరలను శాస్త్రోక్తంగా తొలగిస్తారు.
గతంలో 1966వ సంవత్సరంలో ఈ కవచ తొలగింపు ప్రక్రియను నిర్వహించారు.మండలాభిషేకం తర్వాత యథావిధిగా డిసెంబర్ 29తో 40 రోజుల నిజరూప దర్శనం ముగిసిన అనంతరం, ఆలయం లో మహా మండలాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత నుండి స్వామివారికి తిరిగి యథావిధిగా చందనం, సింధూరం అలంకరణ ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వసతి ఏర్పాట్లు చేశారు.
శంఖు చక్రాలతో ద్విముఖ ఆంజనేయుడు
దేశంలోని మరే ఇతర హనుమాన్ ఆలయాల్లో లేని విధంగా కొండగట్టు మూలవిరాట్టు ఎన్నో అరుదైన విశిష్టతలను కలిగి ఉంది. ఇక్కడి స్వయంభువు విగ్రహానికి ఒకవైపు శాంత స్వరూపుడైన ఆంజనేయస్వామి ముఖం, మరోవైపు (ఉత్తరం వైపు) ఉగ్రరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముఖం దర్శనమిస్తాయి. సాధారణంగా ఆంజనేయుడు గదతోనో, నమస్కార ముద్రలోనో కనిపిస్తారు. కానీ కొండగట్టు అంజన్న చేతుల్లో విష్ణుమూర్తి ఆయుధాలైన శంఖు చక్రాలు ఉంటాయి. శివాంశ సంభూతుడైన హనుమంతుడు విష్ణు ఆయుధాలతో ఉండటం వల్ల ఇక్కడి స్వామిని ’హరిహర స్వరూపం’గా కొలుస్తారు.
– బి. మల్లారెడ్డి
విశ్రాంత ఐపీఎస్ అధికారి


