సండే రీడింగ్
పురిటి నొప్పులను పంటిబిగువున భరించి చంటిబిడ్డతో వేదికపైకి అడుగుపెట్టిన ధైర్యం ఆమెది. కాలికి గజ్జె కట్టి నవ్వులు పూయిస్తూనే తెర వెనుక అగ్నిపర్వతాన్ని మోసిన ‘తమాషా’ నృత్యకారిణి ఆమె. ‘క్వీన్ ఆఫ్ తమాషా’ విఠాబాయి బయోపిక్ ‘ఈతా’గా విడుదలవుతోంది. ఆ మహా కళాకారిణి జీవన యానం...
‘తమాషా కళాకారుల జీవితాలు పూలబాట కాదు. వాళ్ల నృత్యంలో హుషారు ఎంతో జీవితంలో ఆవేదన అంత’... ఇటీవల ‘ఈతా’ ప్రచార కార్యక్రమంలో నటి శ్రద్ధా కపూర్ అన్న మాటలివి.
మట్టిలో కలిసిపోతున్న జానపద కళలకు, ఊరూరా తిరుగుతూ జనాన్ని అలరించిన లోకల్ ఆర్టిస్టుల జీవితాలకు ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో గిరాకీ పెరిగింది. ఇటీవలే తెలుగులో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ వచ్చింది. అలాగే మరాఠీలో ‘నటరంగ్’, ‘చంద్రముఖి’ వంటి చిత్రాలు గ్రామీణ కళాకారుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాయి. ఆ కోవలో వస్తున్న మరో అద్భుత చిత్రమే విఠాబాయి జీవిత కథ ‘ఈతా’. విఠాబాయి పేరులోని ‘విఠా’ను పల్లీయులు ముద్దుగా ‘ఈతా’ అని పలుకుతారు. ఆ మాటనే టైటిల్‌గా పెట్టారు.
ఎవరీ విఠాబాయి?
విఠాబాయి జననమే రంగస్థలం సాక్షిగా జరిగింది. తండ్రి తమాషా కళాకారుడు. సంగీతం, నృత్యం, హాస్యం, సామాజిక వ్యంగ్యం కలగలిసిన మహారాష్ట్ర సంప్రదాయ సంచార నాటక కళే ‘తమాషా’. ఆ సంచారంలో భాగంగా ఆయన పండర్‌పూర్‌లో ప్రదర్శన ఇస్తుండగా, భార్య స్టేజ్ వెనుక పురిటి నొప్పులు పడుతూ విఠాబాయికి జన్మనిచ్చింది. చిన్నప్పటి నుంచి ప్రదర్శనలు చూస్తున్న విఠాబాయి ఎనిమిదేళ్లకే తనూ స్టేజ్ ఎక్కింది.
దళిత (మాంగ్) సామాజిక వర్గానికి చెందిన కళాకారిణి కావడంతో కుల వివక్షతో పాటు, ప్రదర్శనల సమయంలో పురుషుల అసభ్యకర చూపులను, వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘నేను పొట్టకూటి కోసం నాట్యం చేస్తున్నానే తప్ప మీ వినోదం కోసం కాదు’ అని తన పాటల ద్వారానే చురకలు వేసేదామె. తండ్రి, బాబాయ్ చనిపోయాక బృందం బాధ్యతలను భుజాన వేసుకుని, ప్రముఖ నాటక రచయిత మామా వరేర్కర్ ప్రోత్సాహంతో మరాఠా గడ్డపై ‘తమాషా సామ్రాజ్ఞి’ గా తిరుగులేని స్టార్‌డమ్ అందుకుంది విఠాబాయి.
స్టేజ్ మీద పురిటి నొప్పులు!
విఠాబాయి 1960లలో శిఖర్ శింగ్నాపూర్ జాతరలో ప్రదర్శన ఇస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. స్టేజ్ వెనుక టెంట్‌లోకి వెళ్లి ప్రసవించి, ఒక రాయితో బొడ్డుతాడు కోసుకుని, అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని తిరిగి వేదికపైకి వచ్చిందామె. ఆ దృశ్యం చూసి చలించిపోయిన ప్రేక్షకులు ‘మేము నీ ఆట తర్వాత చూస్తాం తల్లీ’ అంటూ కన్నీళ్లతో వెనుదిరిగారు. రాజ్‌కపూర్ స్వయంగా సినిమా ఆఫర్ ఇచ్చినా, తన బృందంపై ఆధారపడిన 50 కుటుంబాల కోసం ఆమె వెండితెరను కాదనుకున్నారు.
పుస్తకం ఆధారంగా..
మరాఠీ రచయిత యోగిరాజ్ బాగుల్ విఠాబాయి బయోగ్రఫీ ‘తమాషా: విఠాబాయిచ్యా ఆయుష్యాచా’ అనే పేరుతో రాశారు. దాని ఆధారంగా ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ శ్రద్ధా కపూర్‌ను విఠాబాయిగా చూపుతూ ‘ఈతా’ తీశారు. విఠా భర్తగా రణదీప్ హుడా నటించారు. శ్రద్ధా కపూర్ ఈ పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. 12 కిలోల బరువు పెరిగారు. ‘ఒక్కో కాలికి నాలుగు కిలోల బరువుండే గజ్జెలు కట్టుకుని లావణి చేయడం నా జీవితంలోనే అత్యంత కఠినమైన సవాల్’ అన్నారు శ్రద్ధా కపూర్. షోలాపూర్, సతారా, నాసిక్ వంటి రియల్ లొకేషన్లలో చిత్రాన్ని సహజంగా తీర్చిదిద్దారు.
ఆఖరుజీవితం
రెండుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న విఠాబాయి చివరి రోజుల్లో భర్త చేసిన అప్పుల వల్ల పేదరికంలో మగ్గింది. 2002లో ఆమె కన్నుమూసినప్పుడు ఆసుపత్రి బిల్లు కట్టడానికి కూడా డబ్బుల్లేక అభిమానులే చందాలు వేసుకున్నారు. సినిమాలో విఠాబాయి ఇంటిపేరులోని దళిత కుల సూచిక ‘మాంగ్’ను తొలగించడంపై విమర్శలు వచ్చాయి. ‘ఆమె ఎదుర్కొన్న కుల వివక్షను, సామాజిక పోరాటాన్ని తుడిచేస్తే అది కేవలం ఒక వ్యక్తిగత కథగా మాత్రమే మిగిలిపోతుంది’ అని రచయిత్రి ప్రజ్ఞా దయా పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ‘పేరు ఏదైనా మా అమ్మ కథ దేశమంతటికీ తెలియడమే నాకు గర్వకారణం’ అంటున్నారు విఠాబాయి కుమార్తె మంగళా బన్సోడే.
ముగింపు
వెలుగుజిలుగుల వెండితెరపై ఒక జానపద కళాకారిణి కన్నీటి గాథను ఆవిష్కరించడం సాహసమే. వివాదాల సంగతి పక్కన పెడితే, విఠాబాయి ఆత్మగౌరవాన్ని, కళాతృష్ణను నేటి తరానికి పరిచయం చేయడంలో ‘ఈతా’ విజయం సాధిస్తే అదే ఆ ‘తమాషా సామ్రాజ్ఞి’కి ఇచ్చే అసలైన నివాళి!


