బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈఠా’. మరాఠీ లవాణి కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలోని ఓ పాట కోసం శ్రద్ధా పడిన కష్టాన్ని దర్శకుడు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె పాదాలు వాచిపోయేవి
ఇటీవల నిర్వహించిన ‘జీజీ రే జీ’ పాట వేడుకలో లక్ష్మణ్ ఉటేకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాట కోసం శ్రద్ధా దాదాపు 25 రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఒక్కో కాలికి నాలుగు కిలోల బరువున్న గజ్జెలు కట్టుకుని రోజూ ఎనిమిది గంటల పాటు సాధన చేసేవారు. దీంతో ఆమె పాదాలు వాచిపోయేవి. లవాణి కళారూపాన్ని అర్థం చేసుకోవడంతో పాటు దానిని పూర్తిగా నేర్చుకోవడానికి ఎంతో శ్రమించారు.
ఇలా శ్రద్ధా కాలి కండరాలకు గాయమైంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. చిత్రీకరణ ఆగిపోయినందుకు నాకు బాధ కలగలేదు. కానీ గాయం కారణంగా శ్రద్ధా ఏడుస్తుండటం చూసి చాలా బాధపడ్డాను. ఆమె వీలైనంత త్వరగా కోలుకుని తిరిగి సెట్స్‌కు రావాలని కోరుకున్నాను. నెల రోజుల్లోనే గాయం నుంచి కోలుకున్నారు. ఈ పాత్రను శ్రద్ధా తప్ప మరెవరూ ఇంత అద్భుతంగా పోషించలేరని నేను భావిస్తున్నాను’ అని ప్రశంసించారు.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్)


