ఆర్ట్ అండ్ కల్చర్
‘స్త్రీ, పురుషులలో ఎక్కువ కష్టాలు పడేది ఎవరు?’
‘కుటుంబ భారాన్ని మోసేది ఎవరు?’
‘త్యాగాలు చేసేది ఎవరు?’.... ఈ ప్రశ్నలు నిన్నా మొన్నటివి కావు. తరతరాల నుంచి వినిపిస్తున్నవే. ఈ ప్రశ్నలపై చర్చలు వీలైనంత వేడిగా జరుగుతుంటాయి.
‘అంత వేడిగా ఎందుకు? హాయిగా నవ్వుతూ మాట్లాడుకోలేమా?!’ అంటున్న స్టాండప్–కమెడియన్ స్రవంతి బస ‘నరుని నారి’ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
‘స్త్రీ పురుషులు ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. తాము పురుషాధిపత్య బాధితులమని స్త్రీలు చెబుతుంటారు. పురుషులకు కూడా వారిదైన వాదన ఉంటుంది. పోరాటాలకు అతీతంగా ఇద్దరూ శాంతియుతంగా కలిసి జీవించడం నేర్చుకుంటే ప్రపంచం సంతోషమయం అవుతుందని నమ్ముతున్నాను’ అంటారు స్రవంతి.
విభేదాల విషయంలో గట్టిగా మాట్లాడుకునే స్త్రీ, పురుషులు అనుబంధాల విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నిస్తారు స్రవంతి. ‘మనల్ని వేరు చేసే విషయాల గురించి అంతులేకుండా మాట్లాడే మనం, మనల్ని ఏకం చేసే శక్తిని కోల్పోతున్నాం’ అంటారు.
స్టాండప్ –కమెడియన్ పని ఏమిటి?
ఇంకేమిటి...ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం!
‘నవ్వించడమే కాదు ఆలోచింపచేయడం కూడా’ అంటున్నారు స్రవంతి.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన స్రవంతి బీటెక్, ఎంబీఏ చేశారు. యూఎస్‌లో మాస్టర్స్/ఐటీ డిగ్రీ చేశారు. స్టాండప్–కమెడియన్‌గా తన కెరీర్‌ను యూఎస్‌లో ప్రారంభించారు. వ్యక్తిగత అనుభవాల నుంచి సామాజిక వైరుధ్యాల వరకు ఎన్నో అంశాలు ఆమె షోలకు ప్రేరణ ఇస్తాయి.


