రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా? అరచేతిలో అల్ట్రా సౌండ్‌ | Breast ultrasound uses sound waves and their echoes to make images of the inside of the breast | Sakshi
Sakshi News home page

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా? అరచేతిలో అల్ట్రా సౌండ్‌

Nov 29 2026 4:55 AM | Updated on Nov 29 2026 4:55 AM

Breast ultrasound uses sound waves and their echoes to make images of the inside of the breast

మూడేళ్ల క్రితం... ఓ మారుమూల పల్లె ప్రాంతంలో నివసించే సామాజికంగా దిగువ వర్గానికి చెందిన మహిళ చాలా భయంగా, ఆందోళనతో ఓ మెడికల్‌ క్యాంప్‌కు వచ్చింది. అసలే చాలా చిన్నపల్లెవాసి. అందునా అభివృద్ధికి నోచని వర్గానికి చెందిన మహిళ. దాంతో రొమ్ము క్యాన్సర్‌గా అనుమానిస్తున్న ఆమెకు స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవడం ఎంత కష్టమో ఎవరైనా ఊహించవచ్చు. 

ఈ నేపథ్యంలో ఆమెకు చేతిలో పట్టేదీ, చేతితో పట్టుకోగలిగేదీ అయిన ఓ చిన్న అల్ట్రాసౌండ్‌ పరికరం సహాయంతో అక్కడున్న సిబ్బంది పరీక్షించి, ప్రాథమికంగా  రొమ్ముక్యాన్సర్‌ను అనుమానించి పెద్ద డాక్టర్‌ దగ్గరికి పంపారు. దాంతో పెద్ద సెంటర్‌లోని డాక్టర్‌ ఆమె క్యాన్సర్‌ను నిర్ధారణ చేసి, చికిత్స అందించారు. ఇప్పుడా మహిళ రొమ్ముక్యాన్సర్‌ నుంచి పూర్తిగా విముక్తురాలై సాధారణ జీవితం గడుపుతోంది.

ఒకవేళ ఆమె ఇంకా చాలా ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్లినా లేదా తన రొమ్ముపరీక్షకు వెనకాడి అసలే వెళ్లకపోయినా చాలా ప్రమాదంలో పడేది. అక్కడ ఆమెకు మేలు చేసిందేమిటంటే... తన పల్లెవరకూ అందివచ్చిన చేతిలో పట్టగలిగే ఓ చిన్న అల్ట్రాసౌండ్‌ పరికరం. పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ (పీయూఎస్‌) అని పిలిచే ఈ పరికరాన్ని ఉపయోగించడానికి పెద్ద పెద్ద రేడియాలజిస్టులూ అక్కర్లేదు. కొద్దిగా చిన్నపాటి శిక్షణ పొందిన సిబ్బంది కూడా సరిపోతారు. అలా చాలా మారుమూల పల్లెల్లోకి వచ్చి కాపాడుతున్న ఆ పోర్టబుల్‌ పరికరం గురించిన వివరాలివి... 

చేతిలో పట్టే అల్ట్రాసౌండ్‌ అంటే ఏమిటి?
చాలామందికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌కూ, సీటీ స్కాన్‌కు పెద్దగా తేడా తెలియదు. ఆ రెండింటిలోనూ రేడియేషన్‌ ఉందనుకుంటారు. కానీ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో కేవలం శబ్దతరంగాలే ఉపయోగిస్తారు. కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ముప్పూ ఉండదు. చాలా సురక్షితం. ఇక పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ అనేది చేతిలో పట్టుకుని ఉపయోగించగలిగే చిన్న వైద్యపరికరం. ఇది హై ఫ్రీక్వెన్సీ కలిగిన ధ్వని (అల్ట్రా సౌండ్‌) తరంగాలను పంపి, దేహంలోపల ఉండే భాగాల చిత్రాలను రూపొందిస్తుంది.
సాధారణ అల్ట్రాసౌండ్‌ యంత్రాలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. పైగా చాలా తక్కువ బరువుతో తేలిగ్గా ఉంటాయి.  
కొన్ని పరికరాలు బ్యాటరీతోనే పనిచేస్తాయి. వీటిని స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ కంటే చిన్నదైన ట్యాబ్లెట్‌కు సైతం అనుసంధానించి ఉపయోగించవచ్చు. అందువల్ల కేవలం ఆసుపత్రులూ, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లోనే కాకుండా మారుమూల పల్లె ప్రాంతాల్లోనూ దీనితో పరీక్షలు నిర్వహించడం సులభ సాధ్యమవుతుంది.

బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌కు నుంచి పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ వరకు...
సాధారణ క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్లో చేతులతో తడిమి గడ్డలు ఉన్నాయేమో గుర్తిస్తారు. నిజానికి ఇది ఎవరికి వారు తేలిగ్గా చేసుకోగల పరీక్ష. మరీ ముఖ్యంగా స్నానం సమయంలో సబ్బు రుద్దుకున్న తర్వాత చర్మం మరింత సున్నితంగా మారినప్పుడు రొమ్ముల్లోని గడ్డలు తేలిగ్గా చేతికి తగులుతుంటాయి. అలాగే డాక్టర్లు కూడా తొలుత ఇలా క్లినికల్‌గానూ పరీక్షిస్తారు. ఎవరికి వారు చేసుకునే పరీక్షను ‘బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌’ (బీఎస్‌ఈ) అనీ, హాస్పిటల్‌లో చేసే పరీక్షను ‘క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ (సీబీఈ) అని అంటారు. అయితే పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌లో ఒక సాంకేతిక పరికరాన్ని ఉపయోగిస్తారు.  ద్వారా రొమ్ము లోపలి కణజాలాన్ని తెరపై చూడవచ్చు. ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రతి సందర్భంలోనూ రేడియాలజిస్టు అవసరం ఉండదు. అయితే క్యాన్సర్‌ తుది నిర్ధారణకు అవసరమైన వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరిగా నిపుణుల ఆధ్వర్యంలోనే జరిగాక, వారే నిర్ధారణ చేస్తారు. 

స్క్రీనింగ్‌తో సకాలంలో చికిత్స
పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్ష తర్వాత ఏమైనా అనుమానాలుంటే... ఇతరత్రా పై నిర్ధారణ పరీక్షలూ చేస్తారు. వాటిలో రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, పేషెంట్‌ను చికిత్స అందించగలిగే పెద్ద ఆసుపత్రులకు పంపుతారు. అక్కడ అవసరాన్ని బట్టి రేడియేషన్‌ చికిత్స లేదా కీమోథెరపీ... అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేస్తారు. ఈ పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ వల్ల  మారుమూల పల్లె ప్రాంతల్లోని మహిళల్లోనూ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు, సకాలంలో చికిత్స పొందేందుకు అవకాశముంటుంది. 

ఏదైనా జంకు లేదా సాధారణంగా సమాజంలో ఉండే వివక్షలూ / నిషేధాలూ / బిడియాల కారణంగా క్యాన్సర్‌ నిశ్శబ్దంగా మూడో లేదా నాలుగో దశకు చేరుకుంటే... అప్పుడు చికిత్స మరింత కష్టతరమైనదిగానూ, ఖరీదైనదిగా మారడంతో పాటు పూర్తిగా కోలుకుంటారన్న హామీ కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే... రొమ్ములో చేతికి తగిలే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ గడ్డలు కావు కాబట్టి... ఈ అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని ఉపయోగిస్తే... తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు పంపాల్సిన మహిళల సంఖ్య దాదాపు 50 శాతం తగ్గే అవకాశమూ ఉంది.  అవసరం లేకుండానే పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. దీనివల్ల మహిళలు, వారి కుటుంబాలు అనవసర ఆందోళనకు, ప్రయాణ ఖర్చులకు, అదనపు వైద్య ఖర్చులకు దూరంగా 
ఉండవచ్చు.

డా. గొలి వాసుబాబు, సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌

నిర్వహణ: యాసీన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement