అతిగా ఫోన్‌తో  అనేక అనర్థాలు | Digital Dementia The Impact of Screen Time on Children | Sakshi
Sakshi News home page

అతిగా ఫోన్‌తో  అనేక అనర్థాలు

Nov 29 2026 5:04 AM | Updated on Nov 29 2026 5:03 AM

Digital Dementia The Impact of Screen Time on Children

డిజిటల్‌ డిమెన్షియా

సమస్య పేరులో డిమెన్షియా ఉన్నా అది మతిమరుపు కాదు. ఇటీవలి రోజుల్లో పిల్లలు చేసే అల్లరిని అదుపులో ఉంచడం కోసం తల్లిదండ్రులు వారి చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్న ఉదంతాలు చాలా సాధారణం. అంతేకాదు... స్మార్ట్‌ఫోన్‌లో  కార్టూన్లు చూస్తూ అన్నం తినే చిన్నపిల్లలు... చేతిలో ఫోన్‌ ఉంటేనే హోంవర్క్‌ చేసే స్కూలు చిన్నారులు... ఎప్పుడూ చిన్నచిన్న వీడియోలు, సోషల్‌ మీడియా చూస్తూ ఉండే టీనేజర్లు... ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మనందరి ఇళ్లలోనూ చాలా మామూలుగా కనిపిస్తున్నాయి.

 డిమెన్షియా అనే మాటను సాధారణంగా మతిమరుపునకు ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల పిల్లలకు మతిమరపు (డిమెన్షియా) వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవుగానీ...  మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్‌ పరికరాలను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని మాత్రం వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ డిమెన్షియా అంటే ఏమిటో, నిపుణుల హెచ్చరికలేమిటో చూద్దాం.

డిజిటల్‌ డిమెన్షియా అనేది గుర్తింపు పొందిన వైద్యపరమైన వ్యాధి కాదు. స్మార్ట్‌ఫోన్లు వాడటం వల్ల పిల్లలకు డిమెన్షియా వస్తుందని కూడా చెప్పడానికి వీల్లేదు. ఆ దాఖలాలూ లేవు. అయితే డిజిటల్‌ పరికరాలపై అతిగా ఆధారపడటం వల్ల పిల్లల ఎదుగుదలలో... ముఖ్యంగా మెదడు అభివృద్ధి చెందే  కీలకమైన సంవత్సరాల్లో వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాలు, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై కొంతమేర ప్రభావం పడవచ్చనే ఆందోళనను వివరించడానికి ‘డిజిటల్‌ డిమెన్షియా’ అనే ఈ పదాన్ని వాడుతున్నారు.

మెదడు చేయాల్సిన పనిని ఫోనే చేస్తుంటే...
సాధారణంగా ఇప్పుడు మధ్య వయసులో ఉన్న పెద్దలు... తాము చిన్నవయసులో ఉండగా... ఇంట్లో పెద్దవారు చెప్పే కథలు వినడం, చెప్పిన విషయాలను గుర్తుంచుకోవడం, సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం, పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలకు దారి గుర్తుపెట్టుకుని వెళ్లడం, బయట ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి అనుభవాల ద్వారా ఆ పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుండేది. ఏ తరంలోనైనా మెదడు తాలూకు సాధారణ అభివృద్ధికి తోడ్పడే అంశాలివి. 

అయితే... ఇప్పుడీ పనుల్లో చాలా వరకు డిజిటల్‌ పరికరాలే చేస్తున్నాయి. ఉదాహరణకు... గూగుల్‌ మ్యాప్స్‌ దారి చూపిస్తుంటే మనం దారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమేముంది? ఏదైనా సమాచారం వెంటనే ఇంటర్నెట్‌లో దొరుకుతుంటే దాన్ని గుర్తుంచుకోవడం ఎందుకు? పాఠాన్ని శ్రద్ధగా చదవడం ఎందుకు? స్క్రీన్షాట్‌ తీసుకుంటే సరిపోతుంది కదా!... ఇలా ఇలా ప్రతి చిన్న అవసరానికీ ఫోన్పై ఆధారపడటం పోను పోను పిల్లల్లో అదో సమస్యగా మారవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏకాగ్రత తగ్గడం ఆందోళన కలిగించే అంశం. 

ఫోన్‌లో తరచూ వస్తూ ఉండే నోటిఫికేషన్లు, వేగంగా మారిపోతుండే వీడియోలు, స్క్రోల్‌ చేస్తూ ఉన్నకొద్దీ ఎప్పటికీ పూర్తికాకుండా అదేపనిగా వస్తుండే  కంటెంట్, తక్షణం దొరుకుతుండే వినోదం... ఇవన్నీ పిల్లల దృష్టిని ఆకర్షించడానికి పోటీపడుతుంటాయి.
మెదడు ఇంతటి వేగవంతమైన వినోదానికి అలవాటుపడితే, పుస్తకం చదవడం, తరగతి గదిలో పాఠం వినడం, హోంవర్క్‌ పూర్తి చేయడం వంటి పనులపై ఎక్కువసేపు శ్రద్ధ పెట్టడం కష్టం కావచ్చు. 

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే... 
చిన్నపిల్లలు ఎక్కువసేపు స్క్రీన్లు చూడటానికి, భాషా నైపుణ్యాలు, 
ఏకాగ్రత తగ్గడానికి సంబంధం ఉన్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. దాదాపు 2,400 మందికి పైగా పిల్లలపై నిర్వహించిన ఒక దీర్ఘకాలిక అధ్యయనంలో... రెండేళ్లు, మూడేళ్ల వయసులో ఎక్కువసేపు స్క్రీన్లు చూసిన పిల్లలకు ఆ తర్వాత నిర్వహించిన కొన్ని అభివృద్ధి పరీక్షల్లో కొంత తక్కువ స్కోర్లు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.

తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు
ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ సూచనల ప్రకారం, పిల్లల వయసును బట్టి స్క్రీన్ వినియోగంపై పరిమితులు పాటించాలి.
రెండేళ్లలోపు పిల్లలు: అప్పుడప్పుడు వీడియో కాల్స్‌ చేయడం మినహా స్క్రీన్‌లకు దూరంగా ఉంచాలి.
2–5 ఏళ్ల పిల్లలు: వినోదం కోసం స్క్రీన్‌లు చూసే సమయాన్ని రోజుకు సుమారు గంటకు పరిమితం చేయాలి.
5–10 ఏళ్ల పిల్లలు: స్క్రీన్‌ సమయాన్ని రోజుకు రెండు గంటలలోపే ఉంచాలి.
పెద్ద పిల్లలు: స్క్రీన్‌ వినియోగంలో బాధ్యతాయుతమైన అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇవే కాకుండా, తల్లిదండ్రులు ఐదు సులభమైన మార్పులు చేయవచ్చు. అవి... 
1. భోజనం చేసే సమయంలో, పడకగదిలో ఫోన్లకు దూరంగా ఉండాలి. 
2. నిద్రపోవడానికి కనీసం గంట ముందు స్క్రీన్‌లు చూడటం ఆపేయాలి. 
3. పిల్లలు ఏడుస్తుంటే వెంటనే ఫోన్ చేతిలో పెట్టే అలవాటును తగ్గించాలి. 
4. స్క్రీన్‌ చూడటానికి బదులుగా పుస్తకాలు చదవడం, బయట ఆడుకోవడం, క్రీడలు, పజిల్స్, ఇతర అభిరుచులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. 
5. తల్లిదండ్రులూ ఫోన్ వినియోగంలో మంచి ఆదర్శంగా ఉండాలి. పిల్లలు పెద్దల అలవాట్లను చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్లలోనే మునిగిపోయి,  పిల్లలు మాత్రం ఫోన్ వాడకూడదని ఆశించడం కష్టం.

వైద్యసహాయం ఎప్పుడు అవసరమంటే... 
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. 
→  చాలాకాలంపాటు ఏకాగ్రత లోపం కనిపించడం. 
→  చదువులో ప్రతిభ / రాణింపు తగ్గడం. 
→  నిద్ర సమస్యలు రావడం. 
→  ఫోన్ తీసేసినప్పుడు విపరీతంగా చిరాకు పడటం. 
→  ఆరుబయట ఆడుకోవడం బాగా తగ్గడం. 
→  ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం.
అయితే, ఈ సమస్యలన్నింటికీ స్క్రీన్ వినియోగమే కారణమని భావించకూడదు. ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు నిరంతరం కనిపిస్తే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.

చివరిగా... పిల్లలను పూర్తిగా స్క్రీన్‌లకు దూరంగా ఉంచడమే లక్ష్యం కాదు. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితంలో భాగమైపోయింది. దాన్ని పిల్లలు సరిగ్గా ఉపయోగించుకునేలా చూడటం కూడా ముఖ్యం. సాంకేతికత అనేది పిల్లల ఏకాగ్రతను, బాల్యాన్ని శాసించకూడదు. అయితే తమ పరిమితిని పిల్లలే తమ అదుపులో ఉంచుకునేలా తల్లిదండ్రులు నేర్పించడమూ అవసరం.

డాక్టర్‌ నళినీకాంత పాణిగ్రహి
నేయోనేటాలజిస్ట్‌ అండ్‌ పీడియాట్రీషియన్‌

నిర్వహణ: యాసీన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement