నగరంలో చాపకింద నీరులా రొమ్ము కేన్సర్
దేశంలోనే అత్యధికంగా బాధితులు ఇక్కడే..
25 శాతం మంది రోగుల వయసు 40 ఏళ్ల లోపే..
ఏటా 15 శాతం పెరుగుతున్న కొత్త కేసులు
స్పష్టం చేస్తున్న ఎంఎన్‌జే ఆసుపత్రి గణాంకాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రొమ్ము కేన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్న అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ సగటు ప్రతి లక్ష మందిలో 26.6 మందిగా ఉండగా, హైదరాబాద్‌లో ఏకంగా 54 మందికి చేరింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారినే ఈ మహమ్మారి లక్ష్యంగా చేసుకునేది.
మారుతున్న కాలంతో పాటే జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాల ప్రభావంతో పాతికేళ్ల యువతులనూ రొమ్ము కేన్సర్ కబళిస్తోంది. 2020 నుంచి ఏటా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్యలో 15 శాతం వృద్ధి కనిపిస్తోందని ఎంఎన్‌జే ఆసుపత్రి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 60 శాతం మంది రోగులు అవగాహనా లోపంతో 3, 4వ స్టేజిల్లో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఎంఎన్‌జే ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య ఏటా సుమారు 15 శాతం పెరుగుతోంది. 2020లో కొత్తగా నమోదైన రొమ్ము కేన్సర్ కేసులు 677 ఉండగా, 2025 నాటికి 2500కు చేరింది. ఇది మహిళాలోకాన్ని కలవరానికి గురిచేస్తోంది. మొత్తం కేన్సర్ కాటేస్తున్న బాధితుల్లో 40 ఏళ్ల వయసులోపు ఉన్నవారే 25 శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం.
నగరానికి చెందిన 22 ఏళ్ల నర్సింగ్ విద్యారి్థనికి రొమ్ము సాధారణానికి భిన్నంగా ఉండటంతో ఇటీవల ఎంఎన్‌జే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. రొమ్ము కేన్సర్ సోకిందని నిర్ధారించుకుని, చికిత్సలకు సిద్ధమైంది. వైద్యుల శస్త్ర చికిత్సల అనంతరం ఆమె కోలుకుంటోంది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన 34 ఏళ్ల గృహిణి రొమ్ము కేన్సర్‌తో ఎంఎన్‌జే ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సుమారు 9 నెలల చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. వీరిద్దరే కాదు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న వారిలో సుమారు 25 శాతం మంది 40 ఏళ్ల వయసు లోపే ఉంటున్నారని ఎంఎన్‌జే వైద్యులు చెబుతున్నారు.
కారణాలనేకం..
గడిచిన ఐదేళ్లలో రొమ్ముకేన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పాతికేళ్లకే రొమ్ము కేన్సర్ అంటే ఆశ్చర్యమేస్తోంది. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు, ప్రాసెస్ చేసిన, జంక్ ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ఆలస్యంగా వివాహాలు, 30 ఏళ్లు దాటేంత వరకు సంతానం లేకపోవడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువ సమయం కూర్చుని ఉండటం, శారీక శ్రమ లేకపోవడం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు రొమ్ము కేన్సర్‌ను ప్రేరేపిస్తున్నాయి.

– మాటూరి రమేష్, సర్జికల్ అంకాలజీ హెచ్‌ఓడీ, ఎంఎన్‌జే ఆసుపత్రి


