ఫండే
కథాకళి
అతను బార్లోంచి బయటికి వచ్చేదాకా సుస్మిత్ వేచి ఉన్నాడు. అతను బయటకి రాగానే చెప్పాడు.
‘‘నిన్ను చంపబోతున్నాను.’’
అతను సుస్మిత్ చేతిలోని రివాల్వర్ నిజమైందని అనుకోలేదు.
‘‘బావుంది. ఆ రివాల్వర్ అమ్ముతావా?’’ నవ్వి అడిగాడు.
‘‘ఇందులోని ఓ గుండుని నువ్వు ఇప్పటికే కొన్నావు. అదే నిన్ను చంపబోతోంది.’’
‘‘ఎందుకు? ఎవరు నువ్వు?’’
అతను సుస్మిత్ కంఠంలోని సీరియస్‌నెస్‌కి కంగారుపడుతూ అడిగాడు.
‘‘ఓ భారత పౌరుడిగా నీ పనిని సక్రమంగా చేయనందుకు. నీ జీతం ఎంత?’’ సుస్మిత్ అడిగాడు.
అతను జవాబు చెప్పాడు.
‘‘అది నువ్వు, నీ కుటుంబం హాయిగా జీవించటానికి సరిపోతుంది. ఐనా ఇల్లు కట్టుకోడానికి అనుమతి ఇవ్వడానికి ఏభై వేలు లంచం ఎందుకు అడిగావు?’’
తక్షణం అతని ముఖంలోకి భయం ప్రవేశించింది.
‘‘అదే ఈ గుండుకి నువ్వు చెల్లించిన డబ్బు. నువ్వు డబ్బు పిశాచివి.’’
రెండుసార్లు కాల్చాక సుస్మిత్ అతని జేబులో ఓ ప్రింటౌట్ పెట్టి మాయమయ్యాడు. లంచం తీసుకోకపోతే అతను జీవించేవాడని అందులో ఉంది. కొన్ని గంటల తర్వాత టీవీలో, మర్నాడు ఉదయం దినపత్రికలో ఎంసీహెచ్ ఉద్యోగి హత్య వార్తతో పాటు, అతన్ని చంపటానికి హంతకుడు వివరించిన కారణం కూడా వార్తగా వచ్చింది.
∙∙
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సబ్‌రిజిస్ట్రార్ కారు రెడ్ లైట్ వెలగడంతో ఆగింది. ఆ కారు వెనక తలుపు తెరుచుకుని లోపలికి ఎక్కిన సుస్మిత్ అడిగాడు.
‘‘నీ జీతం ఎంత?’’
‘‘ఎవరు నువ్వు? ముందు దిగు.’’ ఆయన విస్మయంగా చూస్తూ అరిచాడు.
‘‘నీ జీతం నీ కుటుంబం హాయిగా జీవించడానికి సరిపోతుంది. మరి ఇవాళ అపార్ట్మెంట్ అమ్మే లావాదేవీలో లక్షన్నర లంచం ఎందుకు తీసుకున్నావు? నువ్వో ధనపిశాచివి. అందుకే నిన్ను చంపుతున్నాను.’’
ఆయన్ని కాల్చాక వెనక సీట్లో కాగితం వదిలి అతను కారు దిగి వెళ్ళిపోయాడు.
ఆ కారు దిగి వెళ్ళిన బురఖాలోని వ్యక్తి íసీసీటీవీ కెమేరాలో కనిపించినా, పోలీసులు అది ఉపయోగించలేదు. సబ్‌రిజిస్ట్రార్ లంచం తీసుకోకుండా పని చేస్తే జీవించేవాడనే ఆ ప్రింటౌట్‌ని టీవీలో చూపించారు. ప్రజలు సోషల్ మీడియాలో ఆ వార్తల గురించి చర్చించుకోసాగారు.
∙∙
ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన ఇంట్లోకి వెళ్తూ కాల్చి చంపబడ్డాడు. అతను ఓ కొత్త కారుకి రోడ్ వర్దీ సర్టిఫికెట్‌ని జారీ చేయటానికి పదివేల రూపాయలు లంచం తీసుకున్నందుకు చంపబడ్డాడు. ఓ ఆయిల్ డీలర్ మీద దాడి చేసి, కల్తీ నూనెని పట్టుకున్న బృందంలోని నలుగురు లంచం తీసుకుని ఆ డీలర్‌ని వదిలినందుకు గాను ఆ నలుగురూ హత్య చేయబడ్డారు. వాళ్ళు తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తే జీవించి ఉండేవారని ప్రింటౌట్లో ఉంది.
జూబ్లీ హిల్స్ మండల రవాణా కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్ ఉదయం కె.బి.ఆర్. నేషనల్ పార్క్‌కి వాకింగ్‌కి వెళ్ళినప్పుడు చంపబడ్డాడు. తన భర్త డెత్ సర్టిఫికెట్‌ని చూపించి, తన లీగల్ ఫైనాన్షియల్ స్టేటస్‌ని అప్డేట్ చేయమని ఓ మహిళ కోరితే, రెండు లక్షలు డిమాండ్ చేసినందుకు ఆయన చంపబడ్డాడని, లంచం తీసుకోకపోతే అతను బతికే ఉండేవాడని అతని జేబులో పెట్టిన ప్రింటవుట్‌లో ఉంది.
పేపర్లలో కొందరు ఉత్తరాల శీర్షికలో ఆ హత్యలన్నీ దేశ ప్రక్షాళనకి అవసరమని సమర్థించారు. మరికొందరు ఏ కార్యాలయంలోని ఏ అధికారి లంచం ఇవ్వనందుకు బాధిస్తున్నాడో రాశారు. టీవీ డిబేట్లో కొందరు అతను చేసేది మంచికే ఐనా, అది చెడ్డ దారి కాబట్టి శిక్షార్హుడని వాదించారు. మరికొందరు చట్టం చేయలేని పనిని అతను చేస్తున్నాడని, రాష్ట్రం బాగుపడుతోందని, పడనీయండని వాదించారు. ఓ పత్రిక ఎడిటోరియల్‌లో ఆ నాలుగు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగడం బాగా తగ్గిందని, ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారని రాశారు.
పోలీసు శాఖ ప్రతి హత్య వల్ల ఎవరు లాభం పొందారో గుర్తించి, వారి ఇ¯Œ వాల్వ్మెంట్ ఉందా అని పరిశోధించి, లేదని నిర్ధారణ చేసుకుంది.
∙∙
సుస్మిత్ తన రివాల్వర్ని, గుళ్ళని తన ఇంట్లోని రహస్య ప్రదేశంలో దాచాక శంషాబాద్ ఏర్పోర్ట్కి చేరుకున్నాడు. ఎన్నారై ఐన అతను ఆమ్స్టర్డామ్ మీదుగా అమెరికాలోని నెవార్క్‌కి వెళ్తున్నాడు. అతనికి ఏర్పోర్ట్ లాంజ్‌లో దినపత్రికలు కనిపించాయి. డెక్కన్ క్రానికల్‌ని తీసుకుని అజ్ఞాత హంతకుడికి చెందిన వార్తని చదివాడు. చెన్నైలో కమర్షియల్ టాక్స్ ఆఫీసులోని ఓ ఉద్యోగిని లంచం అడిగినందుకు గుర్తు తెలీని ఎవరో కత్తితో పొడిచి చంపారు. వైజాగ్‌లో, నాగ్‌పూర్‌లో కూడా అలాంటి లంచగొండుల హత్యలు జరిగాయి.
ఓ కొత్త వార్త చదివిన అతనికి ఇండియ¯Œ ్స చైతన్యవంతులే తప్ప, మొద్దు రాచ్చిప్పలు కాదనిపించింది. హైద్రాబాద్ లో శిల్పారామంలో బోటింగ్ చేస్తూ నీళ్ళల్లోకి ఖాళీ పాప్‌కార్న్ కవర్లని, కోక్ సీసాలని పడేసినందుకు చంపాననే ప్రింటౌట్ ఓ ముప్ఫై ఏళ్ళ లివింగ్ టుగెదర్ జంట ఇంట్లో వారి శవాలతో పాటు కనిపించింది. భయం తప్ప భారతీయులని ఏ చట్టం బాగు చేయలేదని ఎనభై ఏళ్ళ కాలం ఋజువు చేసిందని, ఈ ప్రక్షాళన వైరలైతే భారతదేశంలో అవినీతి, అశుభ్రతా క్రమంగా తగ్గిపోతాయని సుస్మిత్ అనుకున్నాడు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇదీ చదవండి: ఖరీదైన విల్లాలో హైప్రొఫైల్ హత్య.. చిన్న ఇయర్‌బడ్ ఎలా పట్టించిందంటే!


