ఖరీదైన విల్లాలో హైప్రొఫైల్‌ హత్య.. చిన్న ఇయర్‌బడ్‌ ఎలా పట్టించిందంటే! | Funday Crucial Story On Bluetooth Earbud Solves Singer Murder Mystery | Sakshi
Sakshi News home page

ఖరీదైన విల్లాలో హైప్రొఫైల్‌ హత్య.. చిన్న ఇయర్‌బడ్‌ ఎలా పట్టించిందంటే!

Oct 18 2026 11:53 AM | Updated on Oct 18 2026 12:37 PM

Funday Crucial Story On Bluetooth Earbud Solves Singer Murder Mystery

ఫండే

క్లూషియల్‌

హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్‌ విల్లాలో అడుగుపెట్టాడు ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్‌ సింగర్‌ ప్రహ్లాద్‌ తన పడకగదిలోనే హత్యకు గురై పడి ఉన్నాడు.

శరీరంపై ఎలాంటి తీవ్ర గాయాలు లేవు, మెడపై కొంచెం కమిలిన గుర్తులు మాత్రమే ఉన్నాయి. గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి రావాల్సి వచ్చింది, కానీ బాల్కనీ తలుపులు మాత్రం తెరిచే ఉన్నాయి.
అభిమన్యు క్రైమ్‌ సీన్‌ ను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఫోరెన్సిక్‌ బృందం వేలిముద్రలు సేకరిస్తోంది. మంచంపై పరుపు చెల్లాచెదురుగా ఉంది. అభిమన్యు మోకాళ్లపై వంగి టార్చ్‌లైట్‌ వెలుగును మంచం కిందకు సారించాడు. అక్కడ అంతా మామూలుగానే ఉంది. కానీ కొంతదూరంలో దుమ్ములో మెరుస్తున్న ఒక చిన్న వస్తువు అతని దృష్టిని ఆకర్షించింది. గ్లౌజ్‌ ధరించిన చేత్తో దాన్ని బయటకు తీశాడు. అది ఖరీదైన, సూక్ష్మమైన ఒక సింగిల్‌ బ్లూటూత్‌ ఇయర్‌బడ్‌.

దాన్ని తీసుకున్న తర్వాత అభిమన్యు గది మొత్తం కలియచూశాడు. ప్రహ్లాద్‌ ఫోన్‌ టేబుల్‌పైనే ఉంది. కానీ అది ఈ బ్లూటూత్‌తో కనెక్ట్‌ అయి లేదు. ప్రహ్లాద్‌ వస్తువుల జాబితాలో ఇలాంటి మోడల్‌ పరికరం ఏదీ లేదు. అంటే, ఇది హంతకుడిదే అయి ఉండాలి. ఘర్షణ సమయంలో హంతకుడి చెవి నుంచి జారి మంచం కింద పడిపోయి ఉంటుంది.

అభిమన్యు వెంటనే సైబర్‌ క్రైమ్‌ నిపుణులను పిలిపించాడు. ఆ బ్లూటూత్‌ కేస్‌కు సంబంధించిన మ్యాక్‌ అడ్రస్, డివైస్‌ లాగ్స్‌ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశాడు. ఆ పరికరం పేరు ‘స్పైడర్‌–గీ’ అని నమోదై ఉంది. ప్రహ్లాద్‌తో సన్నిహితంగా ఉండే ముగ్గురిని అభిమన్యు విచారణకు పిలిచాడు. ప్రహ్లాద్‌ మేనేజర్‌ కిరణ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విక్రమ్, కాంపిటీటర్‌ రాకేష్‌.
హాలులో ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు ఒక్కడే ఉన్నాడు. హాల్లో వున్న సీక్రెట్‌ కెమెరాలు వాటి పని మొదలుపెట్టాయి.
అభిమన్యు ఆ బ్లూటూత్‌ ఇయర్‌బడ్‌ను ఆన్‌ చేసి, ఒక్కొక్కరినీ లోపలికి పిలిచాడు.

‘మొదట రాకేష్, విక్రమ్‌లు గదిలోకి వచ్చినప్పుడు బ్లూటూత్‌లో ఎలాంటి కదలిక లేదు. కానీ చివరిగా ప్రహ్లాద్‌ మేనేజర్‌ కిరణ్‌ తన ఐఫోన్‌ తో లోపలికి ప్రవేశించిన క్షణంలోనే, ఆ హాలులోని బ్లూటూత్‌ డిటెక్టర్‌ అలారం మోగింది. కిరణ్‌ ఫోన్‌ ఆటోమేటిక్‌గా ఆ బ్లూటూత్‌ ఇయర్‌బడ్‌తో పెయిర్‌ అయిపోయింది.
కిరణ్‌ ముఖం పాలిపోయింది. అయినా తడబడుతూ, ‘నా పాత బ్లూటూత్‌ రెండు రోజుల క్రితమే పోయింది సార్‌’ అన్నాడు.

‘కేవలం పెయిరింగ్‌ మాత్రమే కాదు కిరణ్‌! ఈ బ్లూటూత్‌లో ఉన్న ఇంటర్నల్‌ చిప్‌లో చివరిగా కాల్‌ రికార్డ్‌ అయిన ఆడియో డేటా కూడా సేకరించాం. నిన్న రాత్రి 11 గంటల 40 నిమిషాలకు నువ్వు ఎవరితోనో మాట్లాడుతూనే ప్రహ్లాద్‌పై దాడి చేశావు. ప్రహ్లాద్‌ కొత్త మ్యూజిక్‌ ఆల్బమ్‌ కాంట్రాక్ట్‌ క్యాన్సిల్‌ చేసి వేరే కంపెనీకి వెళ్తున్నాడని తెలిసి, అతడిని ఊపిరాడకుండా చేసి చంపావు. ఆ పెనుగులాటలో నీ చెవిలోని బ్లూటూత్‌ మంచం కింద పడిపోయింది. నువ్వు కంగారులో దాన్ని గమనించకుండా బాల్కనీ గుండా పారిపోయావు... పోనీ ఇది కాకుండా నీ దగ్గర వేరే వెర్షన్‌ ఉంటే చెప్పు’ అభిమన్యు అతని వంకే చూస్తూ అన్నాడు.

‘కానీ మా బాస్‌ వేరే కంపెనీకి వెళ్తే నాకెందుకు కోపం?’ కిరణ్‌  సమర్థించుకోవడానికి దబాయించాడు.
‘ఎందుకంటే... పాత మ్యూజిక్‌ కంపెనీతో ప్రహ్లాద్‌ చేసుకున్న కాంట్రాక్ట్‌ ద్వారా నీకు రావాల్సిన కోట్లాది రూపాయల రహస్య కమీషన్‌ పోతుందన్న కసితో, పైగా నువ్వు చేసిన అకౌంట్స్‌ గోల్‌మాల్‌ బయటపడుతుందన్న భయంతోనే ప్రహ్లాద్‌ను ఊపిరాడకుండా చేసి చంపావు!

నీ నేరానికి ఫైనల్‌ వెర్షన్‌ కటకటాలు... ఒక గొప్పగాయకుడిని స్వార్థంతో హత్య చేశావు. నేరస్తుడిగా కటకటాల వెనక్కి వెళ్తున్నావు. పైకి వెళ్ళాక ప్రహ్లాద్‌ కు క్షమాపణ చెప్పుకో అన్నాడు.
కేవలం మంచం కింద దొరికిన ఒక చిన్న బ్లూటూత్‌ పరికరం ద్వారా ఒక హై–ప్రొఫైల్‌ హత్య మిస్టరీని గంటల వ్యవధిలోనే ఛేదించిన అభిమన్యు చురుగ్గా ముందుకు కదిలాడు.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: ‘నేను మున్నాను.. నన్ను చంపేశారు’.. వెలుగులోకి వింత కేసు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement