Shweta Basu Prasad: ‘కొత్త బంగారు లోకం’ డైలాగ్‌ ఇప్పటికీ మర్చిపోలేదు.. | Shweta Basu Prasad Journey Telugu Cinema And Her Life Style | Sakshi
Sakshi News home page

Shweta Basu Prasad: ‘కొత్త బంగారు లోకం’ డైలాగ్‌ ఇప్పటికీ మర్చిపోలేదు..

Oct 25 2026 10:04 AM | Updated on Oct 25 2026 11:15 AM

Shweta Basu Prasad Journey Telugu Cinema And Her Life Style

బాలనటిగా జాతీయ అవార్డు –  హీరోయిన్‌ గా యువత మనసుల్లో ప్రత్యేక స్థానం– ఇప్పుడు ఓటీటీలోనూ విభిన్న పాత్రలతో విలక్షణమైన గుర్తింపు! ఇలా పేరు, ప్రఖ్యాతులు ఎంత పెరిగినా, నటనను ఒక గొప్ప బాధ్యతగా చూస్తోంది నటి శ్వేతా బసు ప్రసాద్‌. తన ప్రయాణం, అనుభవాలు, ఆలోచనలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన సంగతులు ఆమె మాటల్లోనే...

ప్రేమకు గుర్తుగా... పేరు 
మాది ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌. నాన్న అనుజ్‌ ప్రసాద్, అమ్మ శర్మిష్ఠ బసు వారి ప్రేమకు గుర్తుగా నా పేరులోనూ బసు, ప్రసాద్‌ చేర్చుకున్నా. ఐదేళ్ల వయసున్నప్పుడే మా కుటుంబం ముంబైకి మారింది. బాలనటిగా చాలా అవకాశాలు వచ్చాయి. కాని, మా తల్లిదండ్రులు చదువు దెబ్బతింటుందని చాలా సినిమాలకు ‘నో’ చెప్పారు. తర్వాత మాస్‌ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ చేశాను.

గొప్పదని తెలియదు!
‘మక్డీ’ సినిమాలో నటించినప్పుడు నాకు పదకొండేళ్లు. అందులో రెండు పాత్రలు పోషించాను. ఆ సినిమాకే జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు వచ్చింది. అప్పట్లో అది ఎంత గొప్పదో అసలు తెలియదు. చివరకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు అర్థమైంది. నేను సాధించింది చాలా గొప్ప విజయమని.

ఎక్కడా.. ఆ ప్రశ్నే!
‘కొత్త బంగారు లోకం’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందులోని ‘ఎక్కడా...’ అనే డైలాగ్‌తో ఇప్పటికీ నన్ను పలకరిస్తుంటారు. ఒక చిన్న డైలాగ్‌ కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎంతకాలం నిలిచిపోతుందో అప్పుడు ఊహించలేదు. ఇప్పుడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత వరుణ్‌ సందేశ్‌తో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.

ఖాళీగా ఉన్నా... ఫర్వాలేదు!
ప్రతి అవకాశాన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదు. నచ్చిన కథ, బలమైన పాత్ర దొరికితేనే చేయాలనుకుంటాను. మంచి పాత్ర కోసం కొంతకాలం ఖాళీగా ఉన్నా ఫర్వాలేదు. ఎందుకంటే నేను చేసే ప్రతి పనికీ నా పేరు ఉంటుంది. ప్రేక్షకులు నా నటనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటాను.

కెమెరా వెనుకా... ఓ ప్రపంచం!
కథ చెప్పాలంటే కెమెరా ముందే ఉండాల్సిన పనిలేదు. అందుకే ఫిల్మ్‌ మేకింగ్‌పై ఆసక్తితో ‘రూట్స్‌’ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించా. సితార్‌ నేర్చుకోవాలనిపిస్తే యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌తో సాధన మొదలుపెట్టా. పుస్తకాలు చదవడం, పెయింటింగ్, ప్రయాణాలు– ఇలా నా ప్రపంచం కెమెరాకు అవతల కూడా చాలా పెద్దదే!

చేపల కూర ఉంటే చాలు!
చేపల కూర నా ఫేవరెట్‌. వాటితో పాటు వడాపావ్, పానీపూరి లాంటి స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా ఇష్టంగా తింటాను. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నంత మాత్రాన ఇష్టమైన ఆహారాన్ని వదులుకోలేను.

నా కథ ముగియదు!
సినీ పరిశ్రమలో అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఎదురుకావు. కొన్ని సంఘటనలు మనల్ని  క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టవచ్చు. ఎదురైన కష్టాలన్నింటిని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎన్నో అనుభవాలు నేర్పిస్తాయి. వాటిని దాటిన క్షణాలన్నీ అవార్డులే.

ఇదీ చదవండి: భవానీలో భిన్న కోణాలుంటాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement