నీటి మట్టం తగ్గితే... భూమి కూడా డౌన్‌! | Due to the excessive use of groundwater Cities are gradually sinking into the ground | Sakshi
Sakshi News home page

నీటి మట్టం తగ్గితే... భూమి కూడా డౌన్‌!

Oct 22 2026 4:59 AM | Updated on Oct 22 2026 4:59 AM

Due to the excessive use of groundwater Cities are gradually sinking into the ground

భూగర్భ జలాలు పెరిగితే మళ్లీ పైకి లేస్తున్న వైనం

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి

మన దేశంలో ఏటా 10–17 సెం.మీ. కుంగుతున్న ఢిల్లీలోని కపషేరా

కోల్‌కతాలో 8–12 మి.మీ. మేర కుంగుతోందన్న అధ్యయనాలు

తెలంగాణకు ముప్పు తక్కువ.. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో స్వల్ప ఆనవాళ్లు

భూగర్భ జలాల మితిమీరిన వాడకం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలు క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. దీన్నే ఆంగ్లంలో ‘ల్యాండ్‌ సబ్సిడెన్స్‌’గా చెబుతున్నారు. అయితే, ఈ కుంగుబాటు శాశ్వతం కాదు. భూగర్భ జల మట్టాలను సమర్థవంతంగా పునరుద్ధరిస్తే భూమి తిరిగి పైకి లేస్తుందని, మళ్లీ పూర్వస్థితికి చేరే అవకాశం ఉందని సరికొత్త శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా ఏటా 10 సెంటీమీటర్లకు పైగా కుంగిపోతుండటంతో ప్రస్తుతం రాజధానిని వేరే చోటకు తరలించాల్సిన స్థితి నెలకొంది. చైనాలోని టియాంజిన్‌ నగరంలోనూ భూమి కుంగుబాటు తీవ్రంగా ఉంది. అమెరికాలోని శాన్‌ డియాగో, ఇరాన్‌లోని ప్రధాన నగరాలు, న్యూజిలాండ్‌లోని దాదాపు 80% తీరప్రాంత పట్టణాలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 

బెలూన్‌లో గాలి తగ్గినట్టు..పెరిగినట్టు!
నగరాల కింద భూమిలో ఉండే సహజ జలాశయాల (ఆక్విఫర్ల)ను నీటితో నిండిన ఒక భారీ బెలూన్‌తో పోల్చవచ్చు. ఒక పరిమితికి మించి భూగర్భ నీటిని బయటకు తోడేసినప్పుడు ఆ బెలూన్‌ ముడుచుకుపోయి, దానిపై ఆధారపడిన నేల కిందకు కుంగిపోతుంది. అయితే నీటి వినియోగాన్ని నియంత్రించి భూగర్భంలోకి జల వనరులను నింపటం ద్వారా భూమి కుంగిపోవటాన్ని అడ్డుకోవటమే కాకుండా, పూర్వస్థితికి తీసుకురావచ్చని జపాన్‌ అధ్యయనం స్పష్టం చేస్తోంది. భూమి పొరల్లో ఉండే పగుళ్లు లేదా చీలికలు (ఫాల్ట్స్‌) భూగర్భంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకునే సహజ ఆనకట్టల వలె పనిచేస్తున్నట్లు గుర్తించారు. కుంగిన భూమిని వేగంగా పూర్వస్థితికి తేవటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు. 

2 మీటర్లు కుంగి, లేచిన ‘ఒసాకా’
జపాన్‌లో తీవ్ర కుంగుబాటుకు గురైన ఒసాకా నగరం శాస్త్రవేత్తలకు ఒక సహజ ప్రయోగశాలగా మారింది. 1920–1960ల మధ్య అధికంగా నీటిని వాడటం వల్ల అక్కడ నీటిమట్టాలు 30 మీటర్లు తగ్గి, నేల 2 మీటర్ల కంటే ఎక్కువ కుంగిపోయింది. దీనితో ప్రభుత్వం 1960ల్లో భూగర్భ జలాల నియంత్రణపై కఠిన చట్టాలను అమలు చేసింది. పరిశోధకులు 1985 నుంచి ఒసాకాలోని 44 పర్యవేక్షణ బావుల డేటాను, భూఉపరితలంలో మార్పులను పరిశీలించారు. భూగర్భ నీటి నిల్వలు పుంజుకున్నప్పుడు నేల మళ్లీ సంవత్సరానికి సగటున 4 మిల్లీ మీటర్ల నుంచి గరిష్టంగా 12 మిల్లీ మీటర్లు పైకి లేచినట్లు పరిశోధకులు గుర్తించారు.    

మన నగరాల పరిస్థితేమిటి?
» మితిమీరిన భూగర్భ జలాల తోడివేత, వేగవంతమైన పట్టణీకరణ వల్ల మన దేశంలోనూ నేల కుంగుబాటు ప్రమాదం పెరుగుతోంది. ఇస్రో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ).. అత్యాధునిక ఉపగ్రహ రాడార్‌ సాంకేతికత ద్వారా తీరప్రాంతాలు, డెల్టాలు, మెగా ప్రాజెక్టుల స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తుంటుంది. 
»  డెల్టా ప్రాంతాలు, భారీ నిర్మాణ కారిడార్లలో నిశ్శబ్దంగా జరిగే మైక్రో లెవల్‌ మార్పులను ఉపగ్రహ డేటా వెలికితీస్తుంది. 
» ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌), అంతర్జాతీయ ఉపగ్రహ అధ్యయనాల ప్రకారం.. ఢిల్లీలోని కపషేరాలో ఏటా 10–17 సెం.మీ., కోల్‌కతాలో 8–12 మి.మీ. మేర భూమి కుంగుతోందని వెల్లడైంది. 
» కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ), ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదికల ప్రకారం.. దక్కన్‌ పీఠభూమిలోని రాతి పొరల వల్ల తెలంగాణకు కుంగుబాటు ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో స్వల్ప కుంగుబాటు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తేలింది. 
» ఏపీలోని కృష్ణా–గోదావరి డెల్టా, విశాఖ తీరాల్లో ఒండ్రు నేలలు ఉండటం, భూగర్భ జలాలు క్షీణించటం వల్ల నేల కుంగుతోంది. దీని వల్ల సముద్రపు ఉప్పునీరు భూగర్భంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదమూ పెరుగుతోంది. 
» వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాల నిర్వహణపై ఉద్యమ స్ఫూర్తితో దృష్టి కేంద్రీకరించగలిగితే ఈ సమస్యలను అధిగమించవచ్చని అంతర్జాతీయ అనుభవాలు తెలియజెప్తున్నాయి.  

– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement