విదేశీ కొలువుల కంటే స్వదేశమే బెటరా? ఎందుకీ రివర్స్‌ ట్రెండ్‌? | Young Scholars Returning To India Professor Jobs | Sakshi
Sakshi News home page

విదేశీ కొలువుల కంటే స్వదేశమే బెటరా? ఎందుకీ రివర్స్‌ ట్రెండ్‌?

Oct 22 2026 1:37 PM | Updated on Oct 22 2026 2:19 PM

Young Scholars Returning To India Professor Jobs

విదేశాల్లో ఉన్నత చదువులు.. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు.. మంచి ఉద్యోగావకాశాలు.. అయినా యువ భారతీయ పరిశోధకులు స్వదేశం బాట పడుతున్నారు. విదేశాల్లో కెరీర్‌ను వదులుకుని ఐఐటీలు, ఐఐఎంలలో ప్రొఫెసర్లుగా చేరుతున్నారు. కుటుంబానికి దగ్గరగా ఉండటంతోపాటు, భారత్‌లో పరిశోధనలకు పెరుగుతున్న అవకాశాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని విద్యారంగ పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాలో సోషియాలజీలో పీహెచ్‌డీ చేసిన శిల్పా సతీశ్‌ ప్రస్తుతం ఐఐఎం కోజికోడ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆమె.. తన బిడ్డను కుటుంబ సభ్యుల ప్రేమానురాగాల మధ్య కేరళలో పెంచాలనే ఉద్దేశంతో భారత్‌కు తిరిగొచ్చారు. అలాగే, భారతీయ విద్యావ్యవస్థలో తన వంతు పాత్ర పోషించడంతోపాటు, తనకు పరిచయమున్న సామాజిక, పర్యావరణ అంశాలపై స్వదేశంలోనే పరిశోధనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. భారత్‌కు తిరిగిరావాలన్న తన నిర్ణయం సరైనదేనని ఆమె భావిస్తున్నారు.

అయితే, ఐఐఎం బెంగళూరులో యువ అధ్యాపకుల సంఖ్య పెరుగుతుండటం ఈ మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడ మొత్తం 150 మంది అధ్యాపకుల్లో దాదాపు 30 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. గతంలో ఈ సంఖ్య 10 శాతం కంటే తక్కువగా ఉండేది. విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధనలు పూర్తి చేసిన పలువురు యువకులు అంతర్జాతీయ అవకాశాల కంటే భారత్‌లో పనిచేయడానికే ఆసక్తి చూపుతున్నారు. దీంతో విద్యాబోధనతోపాటు నాణ్యమైన పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐఎం బెంగళూరు 2025 మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 21వ స్థానానికి చేరుకుంది. పరిశోధనల నాణ్యత, అంతర్జాతీయ అనుసంధానం పెరగడం ఇందుకు దోహదపడిందని సంస్థ అధ్యాపకులు చెబుతున్నారు.

అలాగే, విదేశాల నుంచి తిరిగొస్తున్న యువ పరిశోధకులకు భారత్‌లో మెరుగుపడుతున్న పరిశోధనా వాతావరణం ఆకర్షణగా మారుతోంది. యువ అధ్యాపకులకు పరిశోధన స్వేచ్ఛ, గ్రాంట్లు, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. మరోవైపు, అమెరికాలో పరిశోధన నిధుల కోతలు, వీసా విధానాల్లో అనిశ్చితి కూడా కొందరిని స్వదేశం వైపు మళ్లిస్తున్నాయి.

అలాగే, యూపీఐ వంటి డిజిటల్‌ వ్యవస్థలు, వేగంగా విస్తరిస్తున్న వినియోగదారుల మార్కెట్‌, గిగ్‌ ఎకానమీ, కృత్రిమ మేధ రంగాలు కొత్త పరిశోధనలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే, పరిశోధనలకు నిధులు, మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ పాశ్చాత్య దేశాలతో ఇంకా పోటీపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిభావంతులు అక్కడే స్థిరపడటాన్ని ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌’గా పేర్కొనేవారు. ఇప్పుడు విదేశాల్లో సంపాదించిన జ్ఞానాన్ని స్వదేశంలో ఉపయోగిస్తూ పరిశోధనలు కొనసాగించడాన్ని ‘బ్రెయిన్‌ సర్క్యులేషన్‌’గా అభివర్ణిస్తున్నారు.

డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఆర్థిక సమ్మిళితత్వం, స్టార్టప్‌లు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్‌ సాధిస్తున్న పురోగతి ప్రపంచస్థాయి పరిశోధనలకు కొత్త అవకాశాలను అందిస్తోందని ఐఐఎం కోజికోడ్‌ డీన్‌ సెబాస్టియన్‌ ఎం.పీ. పేర్కొంటున్నారు. కుటుంబ అనుబంధం, సాంస్కృతిక వాతావరణం, పరిశోధనలకు లభిస్తున్న అవకాశాలు యువతను స్వదేశం వైపు నడిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిభావంతులను భారతీయ విద్యాసంస్థల్లో కొనసాగించాలంటే మెరుగైన పరిశోధనా సదుపాయాలు, తగిన ప్రోత్సాహకాలు కల్పించడం కీలకమని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: జస్ట్‌ కిచెన్‌ మసాలాలతో గిన్సిస్‌ రికార్డు..! ఇంజనీర్‌ అద్భుత సృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement