ఇడ్లీ తయారీకి పిండి పోస్తున్న వృద్ధురాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేటి యువతులు, మహిళలు ఇంట్లో ఒకరిద్దరికి వంట వండాలన్నా ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది 82 ఏళ్ల ఆ వృద్ధురాలు వేకువజామున నిద్రలేచి మూడు గంటలకే టిఫిన్ సిద్ధం చేస్తోంది. ఎవరి సాయమూ లేకుండానే వందలాది మందికి రూ.5లకేలొక ఇడ్లీ చొప్పున, తక్కువ ధరకు వడలు వడ్డిస్తోంది. లాభాల కోసం కాదు.. నలుగురి ఆకలి తీర్చడంలో వచ్చే ఆత్మసంతృప్తి కోసమే అంటోంది ఆ అవ్వ.
కట్టెల పొయ్యిపైనే వంట
చిత్తూరు నగరంలోని వినాయకపురానికి చెందిన ఎల్లమ్మ (82) 25 ఏళ్లుగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గతంలో ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు టిఫిన్ సెంటర్ నడిపేవారు. రాత్రి వేళల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వేకువజామున 3 గంటలకే టిఫిన్ పెట్టగలరా అని అడగడంతో ఎల్లమ్మ ఓకే చెప్పారు. అప్పటి నుంచి ప్రతి రోజూ తెల్లవారుజామున 2 గంటలకే లేచి కట్టెల పొయ్యి మీద వేడివేడిగా ఇడ్లీలు, వడలు తయారుచేస్తున్నారు.
పెరిగిన ధరలు.. మారని మనసు
ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ఎల్లమ్మ తక్కువ ధరకే ఇడ్లీ, వడలు అందజేస్తున్నారు. వర్షం వచ్చినా, చలిగాలులు వీచినా ఆమె టిఫిన్ సెంటర్ బంద్ కాకపోవడం విశేషం. వేకువజామున 3 గంటలకే టిఫెన్ అందుబాటులో ఉండడంతో రాత్రి సమయాల్లో డ్యూటీలు చేసే ఆటో, లారీ డ్రైవర్లు, ప్రోటోకాల్ పోలీసులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎల్లమ్మ కొట్టు వద్దకు వచ్చి కడుపు నింపుకుంటున్నారు. అలాగే సమీపంలోని అపోలో, ఉస్మానియా, గంగా రామ్‌రెడ్డిపల్లి ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు, వైద్య సిబ్బందికి ఈ టిఫిన్ సెంటర్ పెద్ద దిక్కుగా మారింది.
పిల్లలు ఉన్నతాధికారులైనా..
ఎల్లమ్మకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. మిగిలిన కుమారులు పోలీసు శాఖ చిత్తూరులో కానిస్టేబుల్, మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పిల్లలు బాగా చూసుకుంటున్నా, ఆర్థికంగా ఎలాంటి లోటూ లేకపోయినా ఎల్లమ్మ మాత్రం తన టిఫిన్ సెంటర్‌ను వదలడం లేదు.
ఆకలి తీరితే చాలు!
“నాకేం కష్టం లేదు.. మా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు డబ్బు మీద ఆశ లేదు. రూపాయి లాభం మిగిలేది కూడా ఏమీ లేదు. తక్కువ ధరకే కడుపు నిండా ఇడ్లీలు పెడితే వచ్చే ఆత్మసంతృప్తి వేరే దేంట్లోనూ దొరకదు. ప్రతిరోజూ వర్షం, చలి వచ్చినా సరే కొట్టు తీసి టిఫిన్ పెడతా. నాకు అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు.
– ఎల్లమ్మ, నిర్వాహకురాలు, చిత్తూరు
ఇదీ చదవండి: ఎకరం భూమి 99 పైసలు.. కిలో బియ్యం రూ.100


