ఎకరం భూమి 99 పైసలు.. కిలో బియ్యం రూ.100 | Visakhapatnam People Fire On Kutami Govt | Sakshi
Sakshi News home page

ఎకరం భూమి 99 పైసలు.. కిలో బియ్యం రూ.100

Oct 26 2026 7:43 AM | Updated on Oct 26 2026 7:47 AM

Visakhapatnam People Fire On Kutami Govt

నచ్చిన సంస్థలకు అప్పనంగా భూ సంపద దోచిపెట్టిన కూటమి ప్రభుత్వం 

2024 తర్వాత ప్రతి నిత్యావసరాలపై భారీగా ధరల దరువు 

సంపద సృష్టించడం తెలుసంటూ ఎన్నికల్లో బీరాలు పలికిన చంద్రబాబు 

ఇదేనా సంపద సృష్టి అని ప్రశి్నస్తున్న విశాఖ ప్రజలు 

ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతున్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్న ఓటర్లు

గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పారీ్టకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్న నగర ప్రజలు

సాక్షి, విశాఖపట్నం: సామాన్యుడి కంచంలోకి వెళ్లే కిలో బియ్యం వంద రూపాయలకు దొరకని పరిస్థితులు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. బడా సంస్థలకు మాత్రం ఎకరాల ఎకరాల భూములు కేవలం 99 పైసలకే దొరుకుతున్నాయి. పండగ పూట పప్పన్నం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే.. సగటు మనిషి భయపడే రోజుల్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. బియ్యం, ఉప్పు, పప్పు, పంచదార, కూరగాయలు.. ఇవన్నీ నిత్యావసరాలే అయినా.. ఈ ప్రభుత్వం దయవల్ల అవన్నీ ఖరీదైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. 

ఎప్పుడు మైక్‌ దొరికినా.. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ఊదరగొట్టే చంద్రబాబు మాటల వెనుక ఆంతర్యం ఏంటనేది విశాఖ ప్రజలకు అవగతమైందని విశాఖ ప్రజలకు అవగతమైంది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చాక ప్రజా సంపదను నచ్చిన సంస్థలకు అప్పనంగా దోచిపెడుతూ, తమకు నచ్చిన విధంగా సంపదను సృష్టించుకోవడమేనా బాబు చెప్పిందంటూ నగర వాసులు మండిపడుతున్నారు. 

విశాఖ సంపదను దోచేయొద్దు 
‘మీరు సంపద సృష్టించొద్దు.. విశాఖ సంపదను దోచేయొద్దు’ అంటూ గ్రేటర్‌ ఎన్నికల వేళ ఓట్ల కోసం వస్తున్న అధికార పార్టీ నేతలను చూసి నగర ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. ‘సేవ్‌ వైజాగ్‌’ నినాదంతో అధికార కూటమి కబంధ హస్తాల నుంచి తమ నగరాన్ని కాపాడుకునేందుకు, బ్యాలెట్‌నే ఆయుధంగా మలచుకుంటూ తగిన బుద్ధి చెప్పేందుకు విశాఖ ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. 

ఉత్తుత్తి కంపెనీకి రూ.వేల కోట్ల భూములు 
ఊరూపేరు లేని ఉత్తుత్తి కంపెనీ ఉర్సాకు రూ. వేల కోట్ల విలువైన నగర భూములను 60 ఎకరాల వరకు పళ్లెంలో పెట్టి ఇచ్చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్‌ ధరకే భూములు కొనుగోలు చేసుకుంటూ సంస్థలను విస్తరిస్తున్న టీసీఎస్‌కు 21 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 21 ఎకరాలు, ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల చొప్పున.. దొరికిన భూములను దొరికినట్లుగా కేటాయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. 

నిలదీస్తున్న ప్రజలు 
జీవీఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కూటమి నేతలకు అడుగడుగునా పరాభవం ఎదురవుతోంది. ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఓటర్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటేనని పేర్కొంది. ‘అసలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారు? అంటూ రెండేళ్ల ముందు వరకూ ధరలు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయనే విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రజలు నిలదీస్తున్నారని తెలిపింది. ‘బాబూ.. మీ పాలనకు కోదండం.. ఇక ఇంటికి సాగనంపడమే మా కర్తవ్యం’ అన్నట్లుగా ప్రజలంతా ముక్తకంఠంతో కూటమికి చెక్‌ పెట్టాలని భావిస్తున్నారు.

కూటమికి ఓటుతో బుద్ధి చెబుతాం 
2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని చెప్పారు.. ఆ డబ్బులు ఇవ్వకపోగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. కిలో బియ్యం రూ.100కి చేరింది. పప్పులు, నూనెలు, పంచదార గ్యాస్‌ ధరలను కూడా అమాంతం పెంచేశారు. మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తగిన బుద్ధి చెబుతాం.  
– పాల నాగలక్ష్మీ, గృహిణి, నెల్లిముక్కు, పెదగంట్యాడ

కూటమి పాలనలో బతుకు భారం 
2024 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కార్పొరేట్లకు ఎకరం భూమి 99 పైసలకే ఇస్తూ.. సామాన్యుడికి మాత్రం కేజీ బియ్యం ధర రూ. 100 చేశారు. నచ్చిన వారికి భూములు దోచిపెడుతూ పేదల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మధ్యతరగతి బతుకులు భారమయ్యాయి.  గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో వీరికి ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలి. 
 – లక్ష్మీ, గృహిణి, మల్కాపురం

ధరల అదుపులో ప్రభుత్వం విఫలం 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఒక్కసారిగా మండిపోతూ సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు, పంచదార ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకవైపు ప్రజా ధనాన్ని అమరావతికి మళ్లిస్తూ, కార్పొరేట్లకు భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటుతోనే తగిన బుద్ధి చెబుతాం. 
– రమేష్  ఎల్‌వీ నగర్,

సామాన్యులపై ఆర్థిక భారం 
ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఉప్పు నుంచి పప్పు, నూనె, బియ్యం, కూరగాయల వరకు ప్రతి ఒక్కదాని ధర మండిపోతుండటంతో కొనుగోలు చేయాలన్నా, మూడు పూటలా తినాలన్నా భయమేస్తోంది. ఈ ధరల భారంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఒక్కసారిగా పదింతలు పెరిగింది. 
– కోన సింహాచలం, తిమ్మాపురం  

సంపద సృష్టి ఇదేనా.. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న వాడికి ఎకరం భూమి 99 పైసలకు ఇచ్చి, పేదవాడు తినే బియ్యాన్ని మాత్రం రూ. 100 చేశారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి అంటే ఇదేనేమో..జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటుతో ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. 
– ముచ్చు రామారావు, మారికవలన  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement