ఘనంగా ‘దేవర్‌’ గురుపూజోత్సవం! | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘దేవర్‌’ గురుపూజోత్సవం!

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

న్యూస్‌రీల్‌

పసుం పొన్‌కు తరలిన జన సందోహం

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాళి

స్టాలిన్‌, పళణిస్వామి, మంత్రులు అంజలి

ఊరేగింపు...ర్యాలీలతో సామాజిక వర్గం ఉరకలు

కిటకిటలాడిన చైన్నె నందనం, మదురై గోరిపాళయం పరిసరాలు

చైన్నెలో సీఎం విజయ్‌ పుష్పాంజలి

సాక్షి, చైన్నె: పసుం పొన్‌ ముత్తు రామలింగం దేవర్‌ గురు పూజోత్సవాన్ని శుక్రవారం రాష్ట్రంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. దేవర్‌ సామాజికవర్గ ప్రజలు ఈ వేడుకను కోలాహలంగా జరుపుకున్నారు. ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. రామనాథపురం జిల్లా కౌముదిలోని పసుం పొన్‌ గ్రామానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన స్మారక మందిరంలో నివాళులర్పించారు.

రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన ముక్కుళత్తూరు సామాజికవర్గ ప్రజల ఆరాధ్యుడే కాదు, ఆధ్యాత్మిక, రాజకీయవేత్తగా పసుం పొన్‌ ముత్తు రామలింగ దేవర్‌ అందరికీ సుపరిచితులు. ఆయన జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడంతో గురు పూజోత్సవంగా వేడుకల్ని మూడు రోజుల పాటు ఆ సామాజిక వర్గం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తొలిరోజు ఆధ్యాత్మిక వేడుకగా, రెండో రోజు లక్షార్చన వేడుక జరుపుకున్నారు. మూడో రోజు శుక్రవారం 119వ జయంతి, 64వ గురు పూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా రామనాథపురం, విరుదునగర్‌, తెన్‌కాశి, తిరునల్వేలి, తేని, మదురై, శివగంగై, తిరుచ్చి, పుదుక్కోటై, చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకున్నారు. తమ సంక్షేమం కోసం శ్రమించి అమరుడైన దేవర్‌కు ముక్కుళత్తూరు సామాజికవర్గ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. పాల బిందెలతో ఊరేగింపు, కాగడాలతో ర్యాలీలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానాలు, రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

పసుం పొన్‌కు తరలిన నేతలు

రామనాథపురం జిల్లా కౌముదిలోని పసుం పొన్‌ గ్రామంలో ముత్తురామలింగం దేవర్‌ స్మారక ప్రదేశంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. వేడుక కమిటీ నేతృత్వంలో ఆ కేంద్రాన్ని పుష్పాలతో అలంకరించారు. దేవర్‌ విగ్రహానికి బంగారు తాపడాన్ని సమర్పించారు. దేవర్‌ సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవర్‌ స్మారకం వద్ద ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు నిర్మల్‌కుమార్‌, పి.మదన్‌రాజా, వీకే రాజీవ్‌, జిల్లా కలెక్టర్‌ శివగురు ప్రభాకరన్‌ అధికారికంగా నివాళులర్పించారు. అలాగే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌, ఎండీఎంకే నేత వైగోతో పాటు పలు పార్టీల నాయకులు తరలివచ్చి అంజలి ఘటించారు.

పీఎం మోదీ పసుం పొన్‌కు వస్తారు

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఒక రోజు పసుంపోన్‌కు వచ్చి ముత్తురామలింగ దేవర్‌కు నివాళులర్పిస్తారని తెలిపారు. పసుంపోన్‌ ముత్తురామలింగ దేవర్‌ స్వాతంత్య్ర పోరాట సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా సమాజం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను తన నాయకుడిగా అంగీకరించారని వివరించారు. తన జీవితాంతం తమిళనాడు గడ్డపై దేశ ఉన్నతికి, దైవ ఉన్నతికి సేవ చేశారన్నారు. ఆయన రాజకీయాల్లో రాజీపడి ఉంటే, తమిళనాడు సీఎం అయ్యేవారని తెలిపారు.

మానవాళిని శ్వాసగా భావించి జీవించిన దైవం :

సీఎం విజయ్‌ చైన్నెలో నందనంలోని దేవర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ కుల, మత హద్దులను అధిగమించి, మానవత్వమే శ్వాసగా భావించి జీవించిన పసుంపోన్‌ ముత్తురామలింగ దేవర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. జాతీయవాదాన్ని, దైవత్వాన్ని తన రెండు కళ్లుగా భావించి జీవించిన స్వాతంత్య్ర సమరయోధుడు పసుంపోన్‌ ముత్తురామలింగ దేవర్‌ అని కొనియాడారు. దేశభక్తికి, త్యాగానికి, సామాజిక న్యాయానికి చేసిన కృషికి తాను నివాళులర్పిస్తున్నానని తెలిపారు. పసుంపోన్‌లో మంత్రుల బృందం నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముత్తురామలింగ దేవర్‌ గురు పూజోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసుంపోన్‌లో మరిన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముత్తురామలింగ దేవర్‌ కలైయరంగంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల తరఫున 194 మంది లబ్ధిదారులకు రూ.79.70 లక్షల విలువైన సంక్షేమ సహాయకాలను అందజేశారు. మంత్రి జగదీశ్వరి, ఎమ్మెల్యే కల్లనైతో కలిసి మదురైలోని విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పనిభారం, వివిధ కార్యక్రమాల కారణంగానే తాను విడిగా నివాళులు అర్పి ంచినట్టు మంత్రి జగదీశ్వరి వివరణ ఇచ్చారు.

చైన్నె నందనంలో....

చైన్నె అన్నాసాలైలోని నందనం సిగ్నల్‌ వద్ద ఉన్న దేవర్‌ విగ్రహాన్ని విశేషంగా అలంకరించారు. ఇక్కడ నిలువెత్తు చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఆయా పార్టీ నాయకులు తరలి వచ్చి పుష్పాంజలి ఘటించారు. తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జికే వాసన్‌, ప్రధాన కార్యదర్శి జీఆర్‌ వెంకటేష్‌ నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు,, అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ నేతృత్వంలో ఆపార్టీ వర్గాలు, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌ నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు, కాంగ్రెస్‌ తరపున తంగబాలు, చిరంజీవి తదితర నేతలు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement