సాక్షి, చైన్నె : కొడైకనాల్ కొండల్లో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో కేంద్ర భూగర్భ సర్వే బృందం దర్యాప్తు, అధ్యయనం చేపట్టింది. కొన్ని రోజులుగా దిండిగల్ జిల్లాలోని కొడైకనాల్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు దొర్లుకుంటూ వచ్చి ప్రధాన రహదారులపై పడడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా, వరదల కారణంగా పెరుమాళ్మలై – ఉత్తకుం – పెరియకుళం పర్వత మార్గంలోని రోడ్లు పూర్తిగా మూసుకుపోయాయి. దీనివల్ల పలు కొండ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాలకు పరిస్థితులు చోటు చేసుకోవడంతో జియోలాజికల్ సర్వే బృందం రంగంలోకి దిగింది. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సహాయక పనులను కేంద్ర భూగర్భ సర్వే బృందం కొడైకనాల్ రెవెన్యూ శాఖ సహకారంతో సమీక్షిస్తోంది. ఈ బృందం కొడైకనాల్, ఉత్తకం , పరిసర ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది.
15 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు
తాజాగా తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ కొడైకెనాల్ కొండల్లో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొడైకెనాల్ సమీపంలోని కురుసరడి, సవారిక్కాడు, గొంబాయిక్కడు సహా మొత్తం 15 ప్రాంతాల్లో భవిష్యత్తులో కూడా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జియోలాజికల్ బృందం సర్వే జరుగుతుండడం గమనార్హం. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ గత వారం వర్షాలకు అతలాకుతలమైనా, తాజాగా కోలుకుంటోంది.


