సాక్షి, చైన్నె: ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు అనుమతులు మంజూరు చేసేందుకు రూ.400 కోట్ల లంచాలు తీసుకున్నారనే ఆరోపణల కేసులో అరెస్టయిన మాజీ డీఎంకే మంత్రి అన్బిల్ మహేష్‌ను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ఎల్.ఎస్.సత్యమూర్తి ఎదుట విచారణకు వచ్చింది. ఈ క్రమంలో పుళల్ జైలులో ఉన్న అన్బిల్ మహేష్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫు న్యాయవాదుల అబుదు కుమార్ రాజరత్నం, రిచర్డ్‌సన్ విల్సన్ వాదనలు వినిపించారు. అరెస్టుకు ముందే అధికారులు సెప్టెంబర్ 18న 8 గంటల పాటు అన్బిల్ మహేష్‌ను ప్రశ్నించారని, 200కు పైగా ప్రశ్నలకు సమాధానమిచ్చి పూర్తి సహకారం అందించామని తెలిపారు. మళ్లీ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. పాఠశాలల గుర్తింపును ప్రతి 20 ఏళ్లకు ఒకసారి పునరుద్ధరించాలనే నిబంధనను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే తెచ్చారని, ప్రతిపాదన కోరిన సంఘాల ప్రతినిధులే ఇప్పుడు సాక్షులుగా మారారని పేర్కొన్నారు.
జైలు సౌకర్యాలు – ఆరోగ్యం:
జైలులో సరైన ఆహారం అందించకపోవడం వల్ల మహేష్ 2 నుంచి 4 కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. నేరం రుజువయ్యే వరకు ఆయన నిర్దోషి అని, అన్బిల్ మహేష్ కుటుంబం రాష్ట్రం కోసం కృషి చేసిందని, వారిని మానవత్వంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహేష్‌కు ఇంటి భోజనం మందులు అందించాలని సుప్రీం కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కోరారు. పోలీస్ శాఖ తరఫున అదనపు క్రిమినల్ లాయర్ ఉషారాణి, దర్యాప్తు అధికారి సెంథిల్ వాదిస్తూ లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? లంచం రూపంలో వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనే వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అన్బిల్ మహేష్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులు, బినామీ వివరాలపై విచారణ జరపాల్సి ఉన్నందున 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు. జైలులో తగిన వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని, ఇంటి భోజనం అనుమతించే అంశంపై స్పందించడానికి సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ క్రమంలో కోర్టు విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.


