10, ప్లస్‌–2 విద్యార్థులకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

10, ప్లస్‌–2 విద్యార్థులకు పురస్కారాలు

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

సాక్షి, చైన్నె : టీవీకే నేతృత్వంలో నవంబర్‌ 4వ తేదీన చైన్నెలోని ఆర్‌.కే.కన్వెన్షన్‌ సెంటర్‌లో 10వ తరగతి, ప్లస్‌–2 పరీక్షల్లో నియోజకవర్గాల వారిగా మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు విద్యా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ప్రతి ఏటా ఆ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీ నేత విజయ్‌ హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రసంగించనున్నారు. తొలివిడతగా వేలూరు, కడలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల విద్యార్థులను ఎంపిక చేశారు. మంత్రి ఎన్‌.ఆనంద్‌ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

దావోస్‌ సదస్సుకు సీఎం విజయ్‌?

2027 జనవరి 18 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశంలో తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు సదస్సు దోహదపడుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఉద్యోగాలకు వయోపరిమితిని 5 ఏళ్లు పెంపు

సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ సీఎం విజయ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రిజర్వుడు కేటగిరిలో బీసీ, బీసీ ముస్లిం, ఎంబీసీ, టీఎన్‌సీ, ఎస్సీ, ఎస్టీ, నిరు పేద వితంతువులకు ఇప్పటికే ఉన్న వయోపరి మితి సడలింపులకు అదనంగా ఈ పెంపు ఉంటుందని వివరించారు. ఈ వయోపరిమితి పెంపు గ్రూప్‌–1, గ్రూప్‌–2, 2ఎ, గ్రూప్‌–4 సహా అన్ని పోటీ పరీక్షలకు వర్తిస్తుందని తెలిపారు. అలాగే గ్రూప్‌–1 పరీక్షలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 32 నుంచి 37కి, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు 37 నుంచి 42కి పెరుగుతుందన్నారు. గ్రూప్‌–2 పరీక్షలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 30 నుంచి 35కి పెరుగుతుందన్నారు. గతంలో ఉన్నట్లుగా రిజర్వుడు కేటగిరీలకు గరిష్ట వయో పరిమితి లేదు. గ్రూప్‌–4 పరీక్షలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 30 నుంచి 35 ఏళ్లకు పెరుగుతుంది. రిజర్వుడు కేటగిరీలైన బీసీ, బీసీ–ముస్లిం, ఎంబీసీ టీఎన్‌సీలకు 32 నుంచి 37 సంవత్సరాలకు పెరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, నిరుపేద వితంతువులకు వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెరుగుతుంది. అదనపు విద్యార్హతలు ఉన్న రిజర్వుడు కేటగిరీలకు వయోపరిమితి లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం దివ్యాంగులకు అదనంగా 10 ఏళ్ల సడలింపు ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌ 30 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి 5 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది.

అంబాసముద్రం ఉప పోరులో ఉమ్మడి అభ్యర్థి

మద్దతు గందరగోళంపై సీమాన్‌ వివరణ

సాక్షి, చైన్నె : ‘‘నన్ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించడంపై డీఎంకే, అన్నాడీఎంకే లేదా ఎన్డీఏ కూటమి ఏదీ నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చ పార్టీ సభ్యులు, నిర్వాహకుల వల్లే మొదలైంది’’ అని నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం రామనాథపురంలో మీడియాతో మాట్లాడారు. పదవి అంటే సేవ, సేవ అంటే అధికారం అని నమ్మేవారికి అధికారం దక్కకపోతే, దేశ ప్రజల సంక్షేమం అనేది పగటి కలగానే మిగిలిపోతుందని రాజకీయ సంస్కర్త దేవర్‌ బోధించారని గుర్తు చేశారు. ఓట్ల కోసం డబ్బు వెదజల్లేవారు పాపులని, డబ్బు తీసుకుని ఓటు వేసేవారు దేశద్రోహులని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ‘నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడంపై డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్డీఏలలో ఏ ఒక్కటీ అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చను పార్టీ సభ్యులు, నిర్వాహకులే మొదలుపెట్టారు. మా పార్టీ అభ్యర్థులందరూ ప్రజల ఉమ్మడి అభ్యర్థులే’ ’అని సీమాన్‌ వివరించారు. ఈరోడ్‌ ఈస్ట్‌లో ఒంటరిగా పోటీ చేశామని, అంబాసముద్రంలో కూడా విడిగా పోటీ చేస్తామన్నారు. ఇతర పార్టీలు పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానన్నారు. తనను ఒక్కసారి అసెంబ్లీకి పంపితే అంబాసముద్రాన్ని అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో ఉండడాన్ని తాము స్వాగతిస్తున్నామని, మరుదు పాండియార్‌, దీరన్‌ చిన్నమలై వంటి మహనీయుల విగ్రహాల వెనుక ఆయన ఫొటోలు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తమిళనాడు ప్రభుత్వ బాండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని ప్రైవేట్‌ కంపెనీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక బాధ్యతను అమెరికన్‌ సంస్థలకు ఇస్తున్నారని విమర్శించారు. మద్యం సేవించడానికి ప్రజలను రిజర్వేషన్లు చేసుకోమనడం విచిత్రమైన పరిస్థితని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement