లక్షల మంది చేసింది పొరపాటే! | - | Sakshi
Sakshi News home page

లక్షల మంది చేసింది పొరపాటే!

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

సాక్షి, చైన్నె: సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో తీవ్రంగా విఫలమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. తమిళనాడులో శాంతిభద్రతల క్షీణత, మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు, విపరీతమైన ధరల పెరుగుదలకు నిరసనగా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో శనివారం భారీ నిరసనలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘సినిమాలోని హీరో నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని భావించిన లక్షల మంది చేసిన పొరపాటు ఇప్పుడు యావత్‌ ప్రజలపై ప్రభావం చూపుతోంది’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాకముందు శాంతిభద్రతలు బాగాలేవు, మహిళలకు భద్రత లేదని విజయ్‌ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో పట్టపగలు ప్రధాన రహదారులపై హత్యలు, లైంగిక దాడులు, వృద్ధుల హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మైలాపూర్‌, అడయార్‌ వంటి ముఖ్య ప్రాంతాలలోనూ, కోర్టు ఆవరణలోనే హత్యలు జరుగుతున్నాయని, ఖైదీలు జైళ్ల నుంచి పారిపోతున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన కొందరి ప్రమేయంతోనే సగం నేరాల ఘటనలు జరుగుతున్నాయని, మహిళలను టీవీకే రక్షించాల్సిన అవసరం లేదని, ముందు ఆ పార్టీ వారిని అదుపులో ఉంచాలని హితవుపలికారు.

మాదకద్రవ్యాల అక్రమాలు

మెత్‌ భూపాలన్‌ అనే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అరెస్టు చేశాయని, తమిళనాడును మాదకద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా మార్చి వచ్చే డబ్బును టీవీకే ఎన్నికల ఖర్చులకు వాడారనే ఆరోపణలు ఉన్నాయని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ వార్తలు రాసిన జర్నలిస్టులను ఆ పార్టీ కార్యదర్శులు బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. డీఎంకే పాలనలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో, నేడు పరిపాలన అంటే ఏమిటో తెలియని మూర్ఖుల గుంపు పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ షాపుల్లో మోసాలు పెరిగాయని, పేద ప్రజలు బంగారం కొనడం దేవుడెరుక, కనీసం బియ్యం కొనలేని దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకపోవడం వల్లే దేశంలోనే అత్యధికంగా యూనిట్‌ రూ.37లకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు రూ.41కి కొంటామంటూ మరో నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

నిరసన పిలుపు:

‘విద్యుత్‌ కోత – కొడవలి కోత, ప్రస్తుత బిల్లు – కిరాణా బిల్లు, ధరల పెరుగుదల – హత్యల పెరుగుదల... ఇదే నేటి తమిళనాడు వాస్తవం‘ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. శనివారం డీఎంకే చేపట్టబోయే నిరసన ఈ ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు కావాలని, ఎలా పాలించాలో తెలియని ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement