పెద్ద సంఖ్యలో పాల్గొననున్న ఇండియా కూటమి నేతలు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు
4 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు
200కు పైగా సీసీటీవీ కెమెరాల నిఘా
50 వేల మందికి పైగా తరలివస్తారని అంచనా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ఇండియా కూటమి మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతోపాటు ఆయా పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటరు జాబితాలో అవకతవకలకు నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో చేపట్టే ఈ ర్యాలీతో తమ సత్తా చాటేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.
రామ్ లీలా మైదాన్ ప్రధాన ద్వారంపైన త్రివర్ణాలతో కూడిన టెంట్‌ను ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాలుపంచుకునే ఇండియా కూటమి పార్టీలు వేటికవే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. యువత, విద్యార్థులు, మహిళలు, కారి్మకులు, పౌర సమాజాల సభ్యులు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం ఉదయం మింటోరోడ్– కన్నాట్‌ప్లేస్ జంక్షన్ నుంచి చలో ఢిల్లీ పేరుతో మొదలయ్యే ర్యాలీ మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో ముగుస్తుంది. అక్కడ సభ నిర్వహిస్తారు.
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసం నుంచి మార్చ్ ప్రారంభ స్థానం వరకు ఇండియా కూటమి నేతలు బస్సుల్లో ప్రయాణించనున్నారు. మైదానంలోకి చేరుకున్నాక ప్రతిపక్షాల సీనియర్ నేతలకు ప్రధాన వేదిక, ఇండియా కూటమి పార్టీల రాష్ట్రాల ప్రతినిధులకు మరో వేదికను సిద్ధం చేశారు. అనేక వరుసల్లో తెల్లటి టెంట్లు, మెటల్ బారికేడ్లు, కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. మైదాన్‌లో రాత్రి బసకు అధికారులు అనుమతివ్వలేదు. నిర్వాహకులు పది లక్షల మంది రావచ్చని చెబుతుండగా, పోలీసులు మాత్రం 50 వేల మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు
మహా ర్యాలీ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 4 వేల మందికి పైగా పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర సాయుధ పోలీ సు బలగాలను మోహరించారు. రామ్‌లీలా మైదాన్ ప్రాంతాన్ని 14 జోన్లుగా విభజించారు. నిఘా కోసం 200కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మింటో బ్రిడ్జ్ నుంచి కార్యక్రమ వేదిక వర కు ర్యాలీ సాగే మార్గంలోనూ, రామ్‌లీలా మైదాన్ వద్ద కూడా భారీ పోలీసులను బందోబస్తులో ఉంచారు. విపక్షాల ఆందోళన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెలారంభంలో పిలిపించిన 270 కంపెనీల సీఏపీఎఫ్ జవాన్ల మోహరింపును నవంబర్ 16 వరకు మూడోసారి పొడిగించారు.
ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పర్యవేక్షించడంతోపాటు అసాంఘిక శక్తులను గుర్తించడానికి తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. డ్రోన్లతోనూ నిఘా పెట్టినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అల్లర్ల నిరోధక వాహనాలు, ఇతర నిఘా పరికరాలను సిద్ధం చేశారు. రామ్‌లీలా మైదాన్ ప్రాంగణంలోని మొత్తం 14 జోన్లలో జోన్‌కు ఒక ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. ర్యాలీకి హాజరయ్యేవారిని నిర్ణీత ద్వారాల గుండా మాత్రమే అనుమతిస్తామన్నారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేయడంతో సహా భద్రతా పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు స్పష్టంచేశారు. ఖాళీగా ఉన్నప్పుడు రామ్‌లీలా మైదాన్‌లో 45,000 నుంచి 50,000 మంది కూర్చోవచ్చు. వేదిక, కుర్చీలు, నడవడానికి మార్గాలను ఏర్పాటు చేస్తే దాదాపు 40,000
మంది కూర్చోవచ్చు.


