రాహుల్‌ని నకీలి ప్రధానిగా కూర్చొబెట్టండి.. బీజేపీ ఎంపీ | make him a mock pm bjps jibe at rahul gandhi over impeachment show | Sakshi
Sakshi News home page

రాహుల్‌ని నకీలి ప్రధానిగా కూర్చొబెట్టండి.. బీజేపీ ఎంపీ

Nov 1 2026 2:00 AM | Updated on Nov 1 2026 2:00 AM

make him a mock pm bjps jibe at rahul gandhi over impeachment show

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.  ఆ మాక్‌ పార్లమెంటులో  రాహుల్ గాంధీని నకిలీ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టండి’ అంటూ  బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.

నిన్న( శనివారం)  ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన మాక్ పార్లమెంట్ సమావేశంలో జ్ఞానేశ్ కుమార్‌పై ప్రజా అభిశంసన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు అక్రమాలకు గురయ్యాయని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వం కాదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఈ పరిణామాలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీజేపీని ఓడించలేక, ఆందోళనల ద్వారా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మాక్ పార్లమెంట్‌లో ట్రెజరీ బెంచ్‌పై రాహుల్ గాంధీని కూర్చోబెట్టండి. ఆయన టీషర్ట్‌ను పక్కనపెట్టి కుర్తా పైజామా ధరించాలి. అక్కడ ప్రతిరోజూ భజనలు చేస్తూ, ఆయన్ను ‘ప్రధానమంత్రి.. ప్రధానమంత్రి’ అంటూ పిలవండి. మాక్ పార్లమెంట్‌లో ఆయనను నకిలీ ప్రధానమంత్రిగా చేసుకోండి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అయితే కాంగ్రెస్ అసలు లక్ష్యం ఎన్నికల సంస్కరణలు కాదని, అధికార మార్పిడేనని సంబిత్ పాత్ర ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ అయినా, ఆయన అనుచరులైనా వారి ఉద్దేశం ఒక్కటే. SIRపై పోరాటం చేయడం కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదు. ఎన్నికల్లో ప్రజలు పదేపదే తిరస్కరించినప్పటికీ, ఎన్నికలను ఎదుర్కోకుండా అధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని మార్చడం వారి లక్ష్యం’’ అని విమర్శించారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పాత్రపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటోంది. SIRకు సంబంధించిన పలు నిర్ణయాలు మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా తీసుకున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

ఈ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థి సంఘం AISA నాయకురాలు నేహా బోరాపైనా సంబిత్ పాత్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన పరిణామాలను ప్రస్తావిస్తూ.. భారత్‌లోనూ నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అంతేకాకుండా, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సహా పలు సందర్భాల్లో భారత పోలీసు వ్యవస్థ, సాయుధ దళాలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారని సంబిత్ పాత్ర అన్నారు. ‘‘భారత్‌లో పాకిస్థాన్ తరహా పరిస్థితులు కావాలనుకుంటున్నారా? భారత సైన్యం, పోలీసులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని భావిస్తే మీరు భ్రమల్లో ఉన్నట్లే. భారత్ ఏదో అరటి రిపబ్లిక్ కాదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement