ఓట్ల చోరీ దేశ ద్రోహమే  | INDIA Bloc Mock Parliament Passes CEC Impeachment Motion | Sakshi
Sakshi News home page

ఓట్ల చోరీ దేశ ద్రోహమే 

Nov 1 2026 5:22 AM | Updated on Nov 1 2026 5:22 AM

INDIA Bloc Mock Parliament Passes CEC Impeachment Motion

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్షాల మాక్‌ పార్లమెంట్‌  

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం  

ఏకగ్రీవంగా ఆమోదించిన ‘ఇండియా’కూటమి ఎంపీలు  

సీఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌  

దేశద్రోహం ఆరోపణల కింద కోర్టులో విచారణ జరపాలి 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టీకరణ  

ఇతర సంస్థలను మూసివేయడం వల్లే ఇక్కడ భేటీ అయ్యామని వెల్లడి  

మన ఓట్లను కాపాడుకుందామని మల్లికార్జున ఖర్గే పిలుపు  

న్యూఢిల్లీ:  దేశంలో ఓట్ల చోరీకి పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై దేశద్రోహం ఆరోపణల కింద కోర్టులో విచారణ జరపాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో విపక్ష కూటమి ‘ఇండియా’కూటమి ఆధ్వర్యంలో మాక్‌ పార్లమెంట్‌ సమావేశం నిర్వహించారు. 

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా అభిశంసన తీర్మానాన్ని మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టగా, సభ్యులంతా చేతులెత్తి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని తేల్చిచెప్పారు. ‘‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడడానికి, ఓటర్లను తొలగించడానికి, చేర్చడానికి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా జ్ఞానేశ్‌ కుమార్‌ ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించారు. 

భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఎన్నికల ప్రక్రియపై ముందుగానే పథకం వేసి, దాడిని అమలు చేసినందుకు ఆయన దోషి. ఇది ఒక నేరపూరిత చర్య, అంతేకాకుండా దేశానికి, రాజ్యాంగానికి చేసిన ద్రోహం’’అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ సభాపతిగా వ్యవహరించారు. మాక్‌ పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. 

ఈ అభిశంసనను ప్రజల ఓట్లను చోరీ చేయడానికి కుట్ర పన్నిన వారిపై ప్రయోగించిన ‘రాజకీయ ఆయుధం’గా అభివరి్ణంచారు. విపక్ష ఎంపీలు, నాయకులు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని నివాసంలో సమావేశం కావాల్సిన పరిస్థితి రావడం చాలా విచిత్రమని, చరిత్రలో ఇలా ఎప్పడూ జరిగి ఉండకపోవచ్చని అన్నారు. ఇతర సంస్థలను మూసివేయడం వల్ల వేరే మార్గం లేక తాము ఇక్కడ భేటీ కావాల్సి వచ్చిందన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించే తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఈసీపై విచారణ జరగాలని, బాధితులకు న్యాయం అందాలని తేల్చిచెప్పారు.  

2024 లోక్‌సభ ఎన్నికలు ‘చట్టవిరుద్ధం’ 
ఏ వ్యవస్థను కాపాడతానని ప్రమాణం చేశారో, అదే వ్యవస్థ వెనుక సీఈసీ దాక్కుంటున్నారని రాహుల్‌ విమర్శించారు. వారు ఎప్పటికీ ఇలా దాక్కోలేరని చెప్పారు. ఏదో ఒక రోజు ఈ దేశ ప్రజల ప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా ఇక పదవిలో కొనసాగలేరని పేర్కొన్నారు. ఆయన పదవిలో కొనసాగకుండా చేసేందుకు మా దగ్గర తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. తాము ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత కూడా ఆయనను అలాగే పదవిలో కొనసాగించాలని బీజేపీ పట్టుబడితే.. వారి అసలు ఉద్దేశం అందరికీ స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. 

ఓటర్ల జాబితాల నుంచి 13.3 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఇది దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతానికి సమానమని తెలిపారు. 2024 ఎన్నికల్లో విజేతలకు, ప్రతిపక్షాలకు మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 3 శాతం మాత్రమేనని గుర్తుచేశారు. అంటే 2024 లోక్‌సభ ఎన్నికలు ‘చట్టవిరుద్ధం’అని స్వయంగా ఎన్నికల సంఘమే చెబుతోందని వెల్లడించారు. ప్రజల ఓట్లను తొలగించి, నిర్వహించిన ఎన్నికలు చట్టబద్ధం ఎలా అవుతాయని ప్రశ్నించారు. మాక్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్‌ రమేశ్, కేసీ వేణుగోపాల్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కూటమి పక్షాల ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.  

నిజమైన ఓటర్లకు రక్షణ కల్పించాలి  
2014 నుంచి రాజకీయ అధికారాన్ని దక్కించుకోవడానికి, నిలుపుకోవడానికి అధికార పార్టీ అనేక తప్పుడు మార్గాలను అవలంబించిందని ఖర్గే విమర్శించారు. ఎంపీలను దొంగిలించారని, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేశారని, ప్రభుత్వాలను కూలదోశారని, ఎలక్టోరల్‌ బాండ్లు, ఈడీ, సీబీఐలను ప్రయోగించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఓట్లను దొంగిలిస్తున్నారని ఆక్షేపించారు. ఓట్ల దొంగతనానికి తమ వద్ద వందలాది ఉదాహరణలు ఉన్నాయని తేల్చిచెప్పారు. 2023 నాటి చట్టం కారణంగానే జ్ఞానేశ్‌ కుమార్‌ ఓట్ల దొంగతనానికి పాల్పడగలుగుతున్నారని వెల్లడించారు. 

2023 డిసెంబర్‌లో 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి, ఈ బిల్లును ఆమోదించడం సిగ్గుచేటు, అవమానకరం అని దుయ్యబట్టారు. ఈ చట్టం కింద ఎన్నికల కమిషనర్లకు లభించే చట్టపరమైన రక్షణపై కూడా ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. 2023 నాటి చట్టం ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కవచాన్ని కల్పిస్తోందని గుర్తుచేశారు. ఇంతటి రక్షణ కనీసం భారత రాష్ట్రపతికి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఓటర్ల పేర్లను తొలగించడానికే ఎన్నికల సంఘం ‘ఎస్‌ఐఆర్‌’ను చేపట్టిందని ఆరోపించారు.

 నిజమైన ఓటర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చొరబాటుదారుల అంశాన్ని వాడుకుంటోందని చెప్పా రు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించిన అంశాన్ని ఖర్గే ప్రస్తావించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడినప్పుడు మహిళలకు వెంటనే ఓటుహక్కు లభించలేదని గుర్తుచేశారు. ఆయా దే శాలతో పోలిస్తే భారతదేశం అనుసరించిన విధానం చాలా విశిష్టమైనదని తెలియజేశారు. అప్పట్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సార్వత్రిక ఓటు హక్కును వ్యతిరేకించిందని మండిపడ్డారు.  

జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి చేస్తున్న ఆరు ప్రధాన ఆరోపణలను మల్లికార్జున ఖర్గే చదివి వినిపించారు. అవి ఏమిటంటే..  
1.    ఎన్నికలను చోరీ చేయడానికి పెద్ద కుట్ర జరిగింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు జ్ఞానేశ్‌ కుమార్‌ సహకరించారు.  
2.    ఓటర్ల జాబితాల నుంచి 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగించారు.  
3.    పార్లమెంట్‌ ఆమోదం లేకుండానే ఫారం–6లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేశారు.  
4.    కేంద్రం ఎన్నికల సంఘం ఈసీఐనెట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఓటర్ల జాబితాలను తమ ఆ«దీనంలోకి తీసుకుంది.  
5.   ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ దూరంగా ఉంచారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు.  
6.    సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రధానమంత్రి, హోంమంత్రి ఆదేశాల ప్రకారమే పని చేస్తున్నారు. వారు చెప్పినట్టల్లా నడుచుకుంటున్నారు.  

ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడేందుకే తీర్మానం  
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ముమ్మాటికీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల ఆదేశాల మేరకు వ్యవహరించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జ్ఞానేశ్‌ కుమార్‌పై కచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టాలని అన్నారు. మాక్‌ పార్లమెంట్‌లో ఖర్గే మాట్లాడారు. మోదీ, అమిత్‌ షాల ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఎన్నికల సంఘాన్ని నడుపుతున్నారని సీఈసీపై నిప్పులు చెరిగారు. ఏడు నెలల క్రితం 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సీఈసీని తొలగించాలని కోరుతూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. అయితే, తమ నోటీసులను తిరస్కరించారని తప్పుపట్టారు. 

అందువల్ల ఈరోజు ఇక్కడ మాక్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తున్నామని, ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడేందుకు సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. సీఈసీ పట్ల ప్రతిపక్షాలకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని, రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుకుంటున్నామని ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం పట్ల సామాన్య ప్రజలకు ఉన్న నమ్మకం చెక్కుచెదరకుండా ఉండాలని చెప్పారు. బలహీన వర్గాలు, మహిళలు, యువతకు ఉన్న ఓటు హక్కును ఢిల్లీలో కూర్చున్న ఎవరో కంప్యూటర్‌ ద్వారా రహస్యంగా తొలగించకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్ఘాటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement