రాహుల్‌గాంధీ ముందు సిద్దు ఆక్రోశం
స్టింగ్ వ్యవహారంపై అసంతృప్తి
కర్ణాటక: ఢిల్లీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో భేటీలో స్టింగ్ ఆపరేషన్ గురించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో పోటీచేయనని, ముఖ్యమంత్రి రేసులో కూడా ఉండనని సిద్దరామయ్య స్పష్టం చేసినట్లు తెలిసింది. స్టింగ్ వీడియో ఆపరేషన్ వెనుక నిజమైన సూత్రధారి ఎవరు, వీడియో తీసింది ఎవరు, దీని వెనుక ఉద్దేశం ఏమిటి అనేది పూర్తిగా బయటపెట్టాలని సిద్దరామయ్య కోరినట్లు తెలిసింది.
ఈ ఘటనతో తన పరువు పోవడంతో పాటు పార్టీకి పెద్ద దెబ్బతగిలిందని, పరిషత్ ఎన్నికల్లో అన్నింటా ఓడిపోవడం నిదర్శనమని చెప్పినట్లు సమాచారం. రానున్న రాబోయే ఎన్నికల్లో తాను చురుగ్గా ప్రచారానికి రావాలంటే తనపై కళంకం దూరం కావాలని సూచించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి వైఖరి సరిగా లేదని ఆరోపించారని తెలిసింది. ఇద్దరు ప్రముఖ నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.


