కౌంటింగ్ కేంద్రం వద్ద కూర్చొని రోదిస్తున్న బాబా
వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయాన్ని జీర్ణించుకోలేని పచ్చనేతలు
రెండుసార్లు కౌంటింగ్... మూడోసారికీ పట్టు
నిబంధనలు ఒప్పుకోవని విజేతను ప్రకటించిన అధికారులు
శ్రీసత్యసాయి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం అండతో దౌర్జన్యకాండ సాగించిన కూటమి నేతలు...చివరకు ప్రజల మద్దతుతో విజయం సాధించినా...అడ్డుకునే ప్రయత్నం చేశారు. రీకౌంటింగ్ పేరుతో తారుమారు చేయాలనుకున్నారు. అయినా ఒక్క ఓటుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు.
తొలుత 10, ఆతర్వాత 6, మూడోసారి ఒక్కఓటు
స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆది నుంచీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు దౌర్జన్యం చేస్తూ అధికారులును గుప్పిట్లో పెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటి చేసిన బాబా 10 ఓట్లతో విజయం సాధించారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో అధికారులు మరోసారి లెక్కించగా 6 ఓట్లతో బాబా విజయం సాధించారు.
అయినా మళ్లీ రీ కౌంటింగ్‌కు ‘పచ్చ’నేతలు డిమాండ్ చేశారు. మనస్థాపం చెందిన బాబా కౌంటింగ్ కేంద్రంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశాడు. పోలీసులు, అక్కడున్నవారు అతడికి నచ్చజెప్పి కిందికి తీసుకువచ్చారు. దీంతో బాబా రోదిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సమక్షంలో మరోసారి ఓట్లు లెక్కించగా బాబా ఒక్క ఓటుతో విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు మరోసారి లెక్కించాలని పట్టుబట్టినా అధికారులు అందుకు సమ్మతించలేదు. చివరకు గెలుపొందిన బాబాకు అధికారులు డిక్లరేషన్ అందజేశారు.
ఇదీ చదవండి: టికెట్ ఇచ్చి ఓడించారు.. బాబ్జీ, పంచకర్లకు కృతజ్ఞతలు!


