టికెట్‌ ఇచ్చి ఓడించారు.. బాబ్జీ, పంచకర్లకు కృతజ్ఞతలు! | TDP Candidate Rauthu Srinivasa Rao Incident | Sakshi
Sakshi News home page

టికెట్‌ ఇచ్చి ఓడించారు.. బాబ్జీ, పంచకర్లకు కృతజ్ఞతలు!

Nov 4 2026 8:17 AM | Updated on Nov 4 2026 8:20 AM

TDP Candidate Rauthu Srinivasa Rao Incident

పెందుర్తి(విశాఖపట్నం ): ‘నేను టీడీపీలో 36 ఏళ్లుగా కష్టపడి పనిచేశాను. నిత్యం పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేశాను. ఈ ఎన్నికల్లో 106వ వార్డు నుంచి కూటమి తరఫున నాకు టీడీపీ టికెట్‌ కేటాయించి బీఫారం కూడా ఇచ్చారు. కానీ జనసేన నుంచి మరో అభ్యర్థిని పెట్టారు. ఆ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని ఇటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గానీ, అటు టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ గానీ చెప్పలేదు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి సమస్య తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. 

టికెట్‌ ఇచ్చి నన్ను ఓడించిన గండి బాబ్జీకి, పంచకర్లకు కృతజ్ఞతలు’.. అంటూ 106వ వార్డు టీడీపీ(కూటమి) అభ్యర్థి రౌతు శ్రీనివాసరావు ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. కూటమి రెబల్‌(జనసేన) అభ్యర్థి రామునాయుడు చేతిలో ఓడిపోయిన అనంతరం రౌతు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తనకు టికెట్‌ ఇచ్చిన తరువాత పంచకర్ల, గండి బాబ్జీ ఒక్క రోజు కూడా ప్రచారానికి రాలేదన్నారు. కనీసం కార్యాలయం ప్రారంభానికి పిలిచినా మొహం చాటేశారని చెప్పారు.

 టికెట్‌ ఇవ్వడం ఎందుకు? వెన్నుపోటు పొడవడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదేనా కూటమి ధర్మం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకుడిని ప్రోత్సహించే ఉద్దేశం ఉంటే తనకు కూటమి నుంచి టికెట్‌ ఎందుకు కేటాయించారని ధ్వజమెత్తారు. ఇలాంటి వెన్నుపోటు పార్టీలో కొనసాగలేనంటూ అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు రాజీనామా లేఖ పంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement