6 ఓట్లు మాయం చేసి.. 5 ఓట్లతో గెలుపు డిక్లేర్‌ చేసి | GVMC Gajuwaka Zone 91st Ward Counting Controversy | Sakshi
Sakshi News home page

6 ఓట్లు మాయం చేసి.. 5 ఓట్లతో గెలుపు డిక్లేర్‌ చేసి

Nov 4 2026 8:30 AM | Updated on Nov 4 2026 8:30 AM

GVMC Gajuwaka Zone 91st Ward Counting Controversy

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో గాజువాక జోన్‌ పరిధి లోని 91వ వార్డు కౌంటింగ్‌ వివాదాస్పదంగా మారింది. గెలుపోటముల మధ్య కేవలం 5 ఓట్ల తేడాతోపాటు, పోలైన ఓట్లలో 6 ఓట్లు ఏమయ్యాయో లెక్క తేల్చకుండానే.. ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారి టీడీపీ అభ్యర్థి గెలుపునకు ఏకపక్షంగా సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రీకౌంటింగ్‌ పేరుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నమ్మించి, బలవంతంగా సంతకాలు చేయించుకుని టీడీపీ అభ్యర్థిని గెలిచినట్లు హడావుడిగా డిక్లరేషన్‌ ఫారం ఇవ్వడం కలకలం రేపింది.  

రీకౌంటింగ్‌కు అవకాశమున్నా.. : గాజువాక జోన్‌ 91వ వార్డులో మొత్తం 8,443(8,431 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 12) పోలయ్యాయి. కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావుకు 1,975 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 1980 వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థికి 5 ఓట్ల మెజార్టీ వచ్చినట్టయింది. వాస్తవంగా 5 లేదా అంతకంటే తక్కువ ఓట్ల మెజార్టీ ఉన్నప్పుడు సమీప ప్రత్యర్థి రీకౌంటింగ్‌కు కోరితే.. మళ్లీ లెక్కించాలి. పైపెచ్చు ఇక్కడ మొత్తం పోలైన ఓట్లకు, కౌంటింగ్‌ చేసిన ఓట్లకు మధ్య కూడా 6 ఓట్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ వాటిపై స్పష్టత ఇవ్వకపోగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రీకౌంటింగ్‌ పేరిట నమ్మించి, మోసపూరితంగా సంతకాలు చేయించి, కూటమి అభ్యర్థి గెలుపును డిక్లేర్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

ఆ 6 ఓట్లు ఏమయ్యాయి? : టీడీపీ(1,980), వైఎస్సార్‌సీపీ (1,975)కి వచ్చిన ఓట్లతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లో తిప్పల వంశీరెడ్డికి 1,880, రెయ్యి రత్నకు 1,319, సనపల దిల్లేశ్వరరావుకు 702, కశిరెడ్డి సత్యనారాయణకు 106, మల్లాది హేమలతకు 27, బొట్ట నరసింహారెడ్డికు 19, పెంటకోట సన్యాసిరావుకు 2 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లలో 375 రిజెక్ట్‌ ఓట్లు, 52 నోటాకు వచ్చాయి. ఇవన్నీ కలిపితే 8,437 ఓట్లు. మొత్తం పోలైన ఓట్లు(8,443)తో పోలిస్తే 6 ఓట్లు తక్కువ. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావు ‘ఆ 6 ఓట్లు ఏమయ్యాయి?’అని నిలదీసి రీకౌంటింగ్‌ కోరారు. టీడీపీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో ఆర్‌వో, ఎన్నికల సిబ్బంది తెరవెనుక నాటకానికి తెరలేపారు. రీకౌంటింగ్‌కు అంగీకరిస్తున్నట్లు సంతకం పెట్టమని చెప్పి, దాన్ని కాస్తా ‘టీడీపీ అభ్యర్థి గెలుపును అంగీకరిస్తున్నట్లు’చిత్రీకరించి సంతకం చేయించుకున్నారు. ఆ వెంటనే  టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్‌ ఫారం అందజేసేశారు.  

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..: ఈ అక్రమాలపై బాధిత అభ్యర్థి స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు సాయంత్రం 4:49 గంటలకు రాష్ట్ర ఎన్నికల అధికారికి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ, అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా 19వ వార్డులో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మొల్లి లక్ష్మి, 59వ వార్డులో అల్లు వెంకట సత్యశ్రీ గెలిచినా రీకౌంటింగ్‌ పేరిట ఇబ్బంది పెట్టి, అప్పటికీ కుదరకపోవడం వల్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇక్కడ అవకాశమున్నా.. అధికారులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదీ చదవండి: టికెట్‌ ఇచ్చి ఓడించారు.. బాబ్జీ, పంచకర్లకు కృతజ్ఞతలు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement