పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు | Kutami Party Leaders Internal fight In visakhapatnam | Sakshi
Sakshi News home page

పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు

Nov 4 2026 9:27 AM | Updated on Nov 4 2026 9:27 AM

Kutami Party Leaders Internal fight In visakhapatnam

విశాఖపట్నం: పరిషత్‌ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. సీట్ల సర్దుబాటులో కుదిరిన ఒప్పందాన్ని టీడీపీ నాయకులు ఉల్లంఘించారంటూ పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్బవరం మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ, జనసేనలకు చెరో 9 స్థానాలు, బీజేపీకి ఒక స్థానం కేటాయించగా, టీడీపీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఏ విధమైన పొత్తు ధర్మమని ఆయన ప్రశ్నించారు. 

సబ్బవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లో టీడీపీ, జనసేన చెరో సగం స్థానాల్లో, బీజేపీ ఒక్కో స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ, ఆయన తనయుడు వంశీతో చర్చించి సీట్ల సర్దుబాటు చేసుకున్నామన్నారు. 

ఒకసారి ఏకాభిప్రాయానికి వచ్చాక కూడా టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేస్తూ, అదనంగా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. 
పొత్తు ధర్మాన్ని విస్మరించి కూటమి అభ్యర్థుల మధ్య పోటీ పెట్టడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 

ఎంపీపీ అభ్యర్థిగా గండి బాబ్జీ తనయుడు వంశీని నిలబెట్టినప్పటికీ, టీడీపీ అదనపు స్థానాల్లో పోటీ చేయడం ఆయన విజయావకాశాలకే నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం స్పందించి, అదనంగా పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని కోరారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పరోక్షంగా గండి బాబ్జీని హెచ్చరించారు. సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కర్రి కనకరాజు, సీనియర్‌ నాయకులు బలిరెడ్డి అప్పారావు, రోమాల చంద్రశేఖర్, బంతికోళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement