2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి
ఈనెల 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి డీఎస్సీ–2026 నోటిఫికేషన్ జారీచేసింది. భర్తీ చేయనున్న వాటిలో ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాలల్లో 2,111 పోస్టులు (ఎస్‌ఏ 906, ఎస్జీటీ 1,205), స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 350 పోస్టులు (ఎస్‌ఏ 150, ఎస్జీటీ 200), వివిధ సొసైటీల యాజమాన్యాల్లో 260 పోస్టులు (ప్రిన్సిపల్ 30, పీజీటీ 81, టీజీటీ 113, పీడీ 2, పీఈటీ 34) ఉన్నాయి.
వివిధ సొసైటీల యాజమాన్యాల్లోని పోస్టుల్లో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో 85, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీలో 36, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీలో 37, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 68, ఏపీ మోడల్ స్కూల్స్‌లో 19, దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖలో 15 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కనీ్వనర్ తెలిపారు. డీఎస్సీ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పరీక్షల తేదీలు, షెడ్యూల్ వివరాలను https:// tet2 dsc. apcfss. in/ లో చూడవచ్చని పేర్కొన్నారు.
ఐదు జిల్లాలకు జీరో.. 12 జిల్లాలకు సింగిల్ డిజిట్
మెగా డీఎస్సీ–2025లో జరిగిన భారీ స్కామ్‌తో ప్రభుత్వం నిరుద్యోగులు.. ముఖ్యంగా ఉపాధ్యాయ అభ్యర్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మోగడంతో నిరుద్యోగ అభ్యర్థులను మంచి చేసుకోవాలని వరుస నోటిఫికేషన్లకు తెరతీశారు. ఈ క్రమంలోనే డీఎస్సీ–2026 పేరుతో గతనెలలో ప్రభుత్వం 2,721 పోస్టులతో షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పూర్తి వివరాలతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చూసిన అభ్యర్థులు కంగుతిన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 16 జిల్లాలకు అసలు పోస్టులు లేకుండా చేశారు.
సాధారణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు ఉంటాయి. కానీ తాజా ప్రకటనలో కేవలం 1,205 ఎస్జీటీ పోస్టులను మాత్రమే ప్రకటించారు. పైగా పశ్చిమగోదావరి, పల్నాడు, బాపట్ల, సత్యసాయి జిల్లాలకు ఒక్క ఎజ్జీటీ పోస్టూలేదు. విజయనగరం జిల్లాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కర్నూలు జిల్లాకు తప్ప మిగిలిన 25 జిల్లాలకు డబుల్ డిజిట్ దాటలేదు. మొత్తంగా 906 ఎస్‌ఏ పోస్టులు ప్రకటించారు. 2,200 పైగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 350 పోస్టులు మాత్రమే చూపడంపై స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు భగ్గుమంటున్నారు.
ముఖ్యమైన తేదీలు
» ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ: 11.11.2026 నుంచి 30.11.2026 వరకు
» ఆన్‌లైన్ మాక్ టెస్ట్ అందుబాటులోకి వచ్చే తేదీ : 05.12.2026
» హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం : 14.12.2026
» పరీక్షల నిర్వహణ తేదీలు: 20.12.2026 నుంచి 13.01.2027 వరకు
» ప్రాథమిక కీ విడుదల : చివరి పరీక్ష పూర్తయిన 2వ రోజున
» ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన నాటి నుంచి 7 రోజుల లోపు
» తుది కీ విడుదల: అభ్యంతరాల స్వీకరణ ముగిసిన చివరి తేదీ నుంచి 7 రోజుల తర్వాత
» మెరిట్ జాబితా (మార్కులు) ప్రకటన : తుది కీ విడుదలైన 7 రోజుల తర్వాత


