విజయవాడ ఏసీబీ కోర్టులో ఫిర్యాదుదారు ప్రసాద్ కుమార్ ప్రొటెస్ట్ పిటిషన్
ప్రభుత్వ పెద్దల భూ కుంభకోణంలో కీలక పరిణామం
కేసును కొట్టేయాలని నేను ఇష్టపూర్వకంగా సంతకం చేయలేదు
సీఐడీ అధికారులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరించి నోటరీ అఫిడవిట్‌పై సంతకం తీసుకున్నారు
చంద్రబాబు, నారాయణ తదితరులను చట్ట ప్రకారం విచారించాలి
ఎస్సీ, ఎస్టీల భూములను బెదిరించి కాజేశారు
రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల భూములను అన్యాక్రాంతం చేశారు
ఈ కుట్రలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వాములు
వారి కుట్రలకు సీఐడీ అన్ని ఆధారాలను సేకరించింది
ప్రాథమిక చార్జ్‌షీట్‌లో ఆ ఆధారాలను ఏసీబీ కోర్టు ముందుంచింది
చంద్రబాబు అధికారంలోకి రాగానే సీఐడీ వైఖరి మారింది
దర్యాప్తును అటకెక్కించి.. కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా పేర్కొంది
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, పొంగూరు నారాయణ, పలువురు అధికారులు, ప్రముఖ వ్యాపారులు కుమ్మక్కై. ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను మోసపూరితంగా బదలాయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు, నారాయణలతో సహా 60 మంది వరకు నిందితులుగా ఉన్న ఈ కేసును సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కింద పేర్కొంటూ దాఖలు చేసిన తుది నివేదికను నిరసిస్తూ ఫిర్యాదుదారు ప్రసాద్ కుమార్ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు తనను, తన కుటుంబాన్ని బెదిరించి, ప్రాణ భయం చూపించి, బలవంతంగా నోటరీ అఫిడవిట్‌పై సంతకం తీసుకుని, దాని ఆధారంగా తుది నివేదిక దాఖలు చేశారని ప్రసాద్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రాణభయం కారణంగా సంతకం చేశానే తప్ప, అది ఇష్టపూర్వకంగా చేసిన సంతకం కాదని పేర్కొన్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువు కావడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 26.10.2026న ఏసీబీ కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీలు పొందిన తర్వాతే తనకు జరిగిన అన్యాయం అర్థమైందని, ఈ నేపథ్యంలో సీఐడీ తుది నివేదికను వ్యతిరేకిస్తూ, ఈ ప్రొటెస్ట్ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నానని ప్రసాద్ కుమార్ తెలిపారు.
ఈ పిటిషన్ నేరస్థులు తప్పించుకోకూడదనే..
షెడ్యూల్డ్ కుల సంఘాలకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారాలను, హోదాలను దుర్వినియోగం చేస్తూ చట్టవిరుద్ధంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కాజేశారు. ఇటువంటి క్షమార్హం కాని, చట్టవిరుద్ధమైన చర్యలకు శిక్ష పడాల్సిందేనన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేశాను. అసైన్డ్ భూములను కాజేసిన వ్యవహారంలో ఎలాంటి మోసం జరగలేదన్న సీఐడీ వాదనను అంగీకరించలేం. ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసిన స్పష్టమైన కేసు. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం 1989 కింద ఇది తీవ్రమైన నేరం. – పిటిషనర్
చార్జ్‌షీట్ వేసిన సీఐడీ ఆ తర్వాత మాట మార్చింది
ప్రసాద్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణలతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొన్నారు. గుంటూరు సీఐడీ ఏఎస్పీ దర్యాప్తు పూర్తి చేసి 11.3.2024న విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాథమిక చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంపై పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కాగా, 2024లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఐడీ అధికారులు దర్యాప్తును అటకెక్కించారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ప్రసాద్ కుమార్ ఫిర్యాదును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారు.
ప్రసాద్ కుమార్ నుంచి ‘కేసును మూసివేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ’ సంతకాలు చేయించారు. దానిని కోర్టు ముందుంచారు. సీఐడీ దాఖలు చేసిన తుది నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టు అప్పటి న్యాయాధికారి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా పరిగణిస్తూ కేసును మూసివేశారు. ఈ మేరకు 2025 నవంబర్‌లో ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వుల కాపీని బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇటీవల ఏసీబీ కోర్టుకు కొత్త న్యాయా ధికారి రావడంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ‘కేసును మూసివేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ’ ప్రసాద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వెనుక భారీ కుట్ర, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆయన తాజాగా ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ స్పష్టంచేస్తోంది.
ప్రొటెస్ట్ పిటిషన్‌లో ముఖ్యాంశాలు..
» ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు, మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్టర్ కొమ్మారెడ్డి బ్రహా్మనందరెడ్డి, ఇతరులు నన్ను, ఇతర అసైన్డ్ భూ యజమానులను ప్రేరేపించి, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్‌డీడ్లపై సంతకాలు చేసేలా చేశారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను పట్టా భూములుగా చూపిస్తూ మోసపూరితంగా తప్పుడు పత్రాలను సృష్టించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన ఎన్‌ఓసీలను జతచేయకపోవడం ద్వారా చట్టపరమైన నిబంధనలను అతిక్రమించారు.
» పెదపాలెం గ్రామంలో దాదాపు 25 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న 6.5 ఎకరాల భూమిని సెటిల్ చేస్తానని చెప్పి, బ్రహ్మానందరెడ్డి ఆ భూమిని తన భార్య కొమ్మారెడ్డి ఛాయాదేవి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నాతో పాటు ఇతరులకు సమాన వాటాలు ఇస్తానని చెప్పి మోసం చేసి, ఎలాంటి డబ్బు ఇవ్వలేదు.
» అంతేకాక నన్ను బెదిరించి పెదపాలెంలో నాకున్న 45 సెంట్ల భూమిని జీపీఏ–కమ్–సేల్ ద్వారా బ్రహ్మానందరెడ్డి కుమారుడు కొమ్మారెడ్డి హేమ రామిరెడ్డి పేరున మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాకుండా ప్రామిసరీ నోట్లు, ల్యాండ్ రికార్డులు, పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను తన వద్దే ఉంచుకుని వెనక్కి ఇవ్వకుండా వేధించారు.
» బ్రహ్మానందరెడ్డి (భూమిపుత్ర రెడ్డి అని కూడా పిలుస్తారు) రాజధాని ప్రాంత గ్రామాలలో, రాయపూడిలోని అంబేడ్కర్ సొసైటీకి చెందిన 160 ఎకరాలు, లెనిన్ సొసైటీకి చెందిన 100 ఎకరాలు, మంగళగిరి దగ్గర బాపూజీ నగర్ ఎస్సీ భూములు, జగ్గప్ప చెరువు అసైన్డ్ భూములతో పాటు సుమారు 1,000 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా చేజిక్కించుకుని రూ.వేల కోట్లు ఆర్జించారు.
» నాటి తుళ్లూరు తహసీల్దార్ సు«దీర్ బాబు, ఇతర రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం ద్వారా ఈ అక్రమ బదలాయింపులు జరిగాయి. ఇందులో పలువురు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలకు భాగం ఉంది. ఎస్సీ, ఎస్టీ రైతుల అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఎలాంటి నష్టపరిహారం రాదని మభ్యపెట్టి, తక్కువ ధరలకే మా భూములు లాక్కున్నారు. పెద్ద మొత్తంలో భూములను బినామీ పేర్ల బదలాయించారు.
» ఈ అక్రమాలపై 2020 ఫిబ్రవరి 14న మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశాను.


