ఘటనా స్థలంలో నేతలకు వైఎస్ అవినాశ్ రెడ్డి పరామర్శ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియోజకవర్గం పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ మూకలు దాష్టీకానికి పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ నేతకు చెందిన ఆస్తులకు నిప్పు పెట్టాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత నేతను పరామర్శించి ధైర్యం చెప్పారు.
పులివెందులలో సదరు నేతకు చెందిన చికెన్ సెంటర్‌తో పాటు ఇతర సామగ్రికి కూడా టీడీపీ గూండాలు నిప్పు పెట్టాయి. నామినేషన్ల నేపథ్యంలోనే బెదిరింపులకు దిగుతూ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఎంపీ అవినాశ్ రెడ్డి.. బెదిరింపులకు, దాడులకు తలవంచబోమని, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని తీరతామన్నారు. ఆ సమయంలో ఆయన వెంట మున్సిపల్ ఇంచార్జిలు వైఎస్ మనోహర్ రెడ్డి, దుష్యంత్ రెడ్డిలు ఉన్నారు.

నిన్న ఘోరం
రెండేళ్ల కూటమి పాలనపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు రాక్షసక్రీడకు తెర తీశారు. ఆయన ఆదేశాలతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. నిన్న పుంగనూరులో వైఎస్సార్సీపీ నేతల నామినేషన్లను అడ్డుకునేందుకు ఏకంగా ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేసి పలు వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయానికి, పలు వాహనాలకు నిప్పు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
నేడు కూడా కొనసాగుతున్న..
రాష్ట్రంలో పచ్చమూక అరాచకాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ అంటోంది. తమ పార్టీ శ్రేణులపై దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శిస్తోంది. దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంటోంది. పైగా మాట వినకుంటే తప్పుడు కేసులతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంటోంది. ఈ ఘటనలను ఖండించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చిన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ హింసాకాండను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగితేనే ఎన్నికలు సజావుగా సాగుతాయని అంటున్నారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దారుణం


