సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు పోలింగ్ కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన ఆయనను ఎన్నికల సిబ్బంది తొలుత అడ్డుకున్నారు. అనంతరం, లోపలికి అనుమతించారు.
అయితే, ఎమ్మెల్యే బోండా ఉమా ఓటర్ స్లిప్ తీసుకొచ్చినప్పటికీ ఆధార్, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు తన వెంట తీసుకురాకపోవడంతో ఓటు వేసేందుకు అధికారులు, పోలీసులు అనుమతించలేదు. దీంతో తన అనుచరుల ద్వారా ఆధార్ కార్డు తెప్పించుకున్న బోండా ఉమా అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేత అరెస్ట్
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు చావా పిచ్చయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో కూటమి నాయకుల ఆగడాలను ప్రశ్నించినందుకు ఆయనపై కేసులు ఉన్నాయంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాగా, పోలింగ్ వేళ ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు


