వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే, నిలువరించాల్సిన అధికార యంత్రాంగం వంత పాడి పరువు పోగొట్టుకుంది. తాజాగా వెలువరించిన గణాంకాల్లో అధికార పార్టీ అరాచకాలు బట్టబయలు అయ్యాయి.
పులివెందుల మున్సిపాలిటీలో ఉదయం 11 గంటలకు 1.25 శాతం ఇతరుల ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 54532 ఓట్లలో 681 ఇతరుల ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారమే పులివెందుల మున్సిపాలిటీలో కేవలం 14 మంది మాత్రమే ఇతరుల కేటగిరీ ఓట్లు ఉన్నాయి. 14 మందికి 681 మంది ఎలా ఓటు వేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పచ్చ మూకలు ఎడాపెడా రిగ్గింగ్ చేయడం వల్లే లెక్కలు 'తారుమారు' అయ్యాయని స్థానికులు అంటున్నారు.
పోలింగ్ శాతంపై అనుమానాలు
ఉదయం 11 గంటలకు పులివెందులలో 34 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కేవలం 4 గంటల్లోనే 34 శాతం పోలింగ్ జరగడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మలమడుగులో ఏకంగా 42.5 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. టీడీపీ రిగ్గింగ్ కారణంగానే పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కాగా, పులివెందులలో ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలను పచ్చ మూకలు ఆక్రమించాయి. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను రానివ్వకుండా యధేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. పోలింగ్ ప్రారంభం కాకముందే రిగ్గింగ్‌కు దిగారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
పాత కడప జడ్పీ హై స్కూల్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మీ ఓట్లు మేము వేసుకున్నామని టీడీపీ నాయకులు అనడంతో మహిళలు నిరాశగా వెనుదిరిగారు.
ఇదీ చదవండి: వైఎస్ జగన్ కాన్వాయ్ ఎదుట దస్తగిరి హల్‌చల్
పులివెందుల మండలం పెద్ద రంగాపురం బూత్ వద్ద టీడీపీ మూకలు బయట నుంచి ఎవరిని రానివ్వకుండా లోపలనే రిగ్గింగ్ చేసుకున్నాయి. ఇస్లాంపురం పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. పోలీసులు వారికి పూర్తిగా సహకరించడం ఓటర్లను నిశ్చేష్టులను చేసింది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నిరసన
పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కార్యాలయం మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. వీరిని భయపెట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. భారీ స్థాయిలో పోలీసు బలగాలను మొహరించారు.
ఇదీ చదవండి: కొబ్బరికాయ కొట్టి పోలింగ్ ప్రారంభించిన వీర మహిళ!


