సాక్షి, కర్నూలు: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని డీఐజీ కోయ ప్రవీణ్‌ను కోరారు.
మాజీ మంత్రి బుగ్గన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, దాడులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలను దేశమంతా చూసింది. ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు ఉందని, అయితే ఎన్నికల సమయంలో జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలతో రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నామినేషన్ పత్రాలు చించేశారు!
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే దౌర్జన్యాలు జరిగాయని బుగ్గన ఆరోపించారు. టీడీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలను చించివేశాయని, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశాయని అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఈ ఘటనలన్నింటినీ డీఐజీ కోయ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమని బుగ్గన పేర్కొన్నారు. రాజకీయాలు పుట్టిందే గ్రామాల నుంచి అని, అందుకే గ్రామస్థాయి ఎన్నికలను ఎలాంటి ఒత్తిళ్లు, దాడులు, దౌర్జన్యాలు లేకుండా నిర్వహించాలని కోరారు.
కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డీఐజీని కోరినట్లు బుగ్గన వెల్లడించారు. గత ఎన్నికల తరహా ఘటనలు పునరావృతం కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు ఇచ్చి రెండూ ఓడించారు!


