కర్నూలు: తొలిసారిగా పంచాయతీ ఎన్నికలకు శ్రీశైలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సున్నిపెంట గ్రామం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సున్నిపెంటకు చేరుకున్నారు. వేలాది మంది వలస కూలీలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ తలపించేలా సున్నిపెంట విస్తరించింది. గ్రామ పంచాయతీగా గుర్తింపు లేకపోవడంతో ఇప్పటి వరకు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. కేవలం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమైంది.
తొలి సర్పంచ్ కిరీటం ఎవరిని వరించునో..
సున్నిపెంటలో మొత్తం 21,452 మంది నివాసం ఉంటున్నారు. ఇందులో ఎస్సీలు 6,226 మంది, ఎస్టీలు 1,982, ఇతర అన్ని కులాలు 13,244 మంది ఉన్నారు. ప్రస్తుతం గ్రామాన్ని 14 వార్డులుగా విభజించారు. మొత్తం ఓటర్లు 14,660 మందిగా గుర్తించారు. ఇందులో పురుషులు 7,113, మహిళలు 7,554, ఇతరులు ఒకరుగా ఉన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వివిధ పాఠశాలల్లో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో సర్పంచ్‌గా ఎవరెవరు పోటీ చేస్తారో, ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్నది తేలాల్సి ఉంది. గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్యే పోటీ ఉండనుంది.
గెజిట్ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేస్తాం
సున్నిపెంట గ్రామ పంచాయతీకి నవంబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు అన్ని నివేదికలు పంపాం. జిల్లా కలెక్టర్ గెజిట్ విడుదల చేసిన తర్వాత సర్పంచ్‌కు రిజర్వేషన్లు ఖరారు చేస్తాం.
– రమణ, ఎంపీడీఓ
వైఎస్సార్ చలువతో...
సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవో నంబర్ 2 జారీ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీశైలం ఎమ్మెల్యే గా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ శాఖల మంత్రులు, అటవీశాఖ అధికారులతో చర్చించారు. గ్రామ పంచాయతీగా సున్నిపెంటను రికార్డులో నమోదు చేసేందుకు కృషి చేశారు. దీంతో ఈ గ్రామంలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికల శంఖారావానికి అధికారులు శ్రీకారం చుట్టారు.


