డిపాజిట్‌ అంటే ఏమిటి? ఎన్నికల్లో ఎంత చెల్లించాలి? | Election Deposit Rules Sarpanch Ward Member Fees Expenses | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌ అంటే ఏమిటి? ఎన్నికల్లో ఎంత చెల్లించాలి?

Nov 13 2026 1:16 PM | Updated on Nov 13 2026 1:28 PM

Election Deposit Rules Sarpanch Ward Member Fees Expenses

సత్తెనపల్లి(పల్నాడు): ఎన్నికల సమయంలో ‘డిపాజిట్‌ కూడా దక్కలేదు.. డిపాజిట్‌ కూడా దక్కనీయలేదు’ అనే పదాలను మనం తరచూ వింటుంటాం. ఇంతకీ ఈ డిపాజిట్‌ కథ ఏమిటంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి రశీదు పొందాల్సి ఉంటుంది. ఈ రశీదును నామినేషన్‌ పత్రానికి జతచేయాలి. లేని పక్షంలో నామినేషన్‌ తిరస్కరిస్తారు. నామినేషన్‌ ఫారంతో పాటు డిపాజిట్‌ కింద సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.3 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. 

వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.వెయ్యి కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.500 చెల్లించాలి. పది వేల కంటే తక్కువ జనాభా కలిగిన పంచాయతీకి పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50 లక్షలు,  వార్డు సభ్యుడైతే రూ. 60 వేలు... పది వేలకు మించి జనాభా కలిగిన పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థి రూ.4 లక్షల వరకు, వార్డు సభ్యుడైతే రూ.లక్ష వ్యయ పరిమితిని విధించారు. వ్యయ పరిశీలకులు సూచించే విధంగా పోటీలో ఉన్న అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను నిబంధనల మేరకు లెక్కలతో సహా ఆడిటర్లకు అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.  

డిపాజిట్‌ కోల్పోవడం అంటే... 
పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత అభ్యర్థులకు వచ్చిన చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే, ఆ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయినట్లు చెబుతారు. ఉదాహరణకు వెయ్యి ఓట్లు పోలై, అన్నీ చెల్లుబాటు అయ్యాయని అనుకుందాం. పోటీ చేసిన అభ్యరి్థకి 1/6 వంతు అంటే సుమారు 167 ఓట్లు రావాల్సి ఉంటుంది. అప్పుడే అతడికి డిపాజిట్‌ దక్కినట్లు. లేకపోతే దక్కనట్లు అర్థం. 1/6 వంతు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పోటీ సమయంలో డిపాజిట్‌ చేసిన నగదును తిరిగి ఇస్తారు. లేదంటే డిపాజిట్‌ నగదును తిరిగి ఇవ్వకుండా, ఆ మొత్తాన్ని పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌లో జమ చేస్తారు.    

ఇదీ చదవండి: సర్పంచ్‌ పదవికి టీడీపీ నాయకుల వేలం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement