పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు! | Local Body Elections, Violence Erupts In Punganur As YSRCP MP Mithun Reddy And Several Others Suffer Injuries | Sakshi
Sakshi News home page

పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!

Oct 16 2026 11:40 AM | Updated on Oct 16 2026 12:46 PM

Punganur Violence: Bloodied but Undeterred YSRCP Leaders Stands Firm

సాక్షి, ఉమ్మడి చిత్తూరు: చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ పుంగనూరులో హింసాకాండకు దిగాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి సహా పలువురికి గాయాలయ్యాయి.

నామినేషన్‌ ప్రక్రియ షురూ కావడం, టీడీపీ శ్రేణులు అడ్డుపడొచ్చనే ముందస్తు సమాచారంతో.. అభ్యర్థుల్ని దగ్గరుండి నామినేషన్‌ వేయించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్వయంగా బయల్దేరారు. ఈ క్రమంలో నామినేషన్‌ సెంటర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తొలుత ఎంపీ కాన్వాయ్‌కు అడ్డుపడ్డ టీడీపీ గూండాలు.. ఆ తర్వాత గేట్లు తోసుకుని లోపలికి వెళ్లి దాడులు మొదలుపెట్టారు. ఆ సమయంలో హైడ్రామా నడిచింది.

ఎంపీ కాన్వాయ్‌ సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. మనుషులు, వాహనాలపైకి రాళ్లు కర్రలు విసురుతూ విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో మిథున్‌రెడ్డి సహా కొందరికి గాయాలయ్యాయి. ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నించిన గన్‌మెన్‌కి కూడా నెత్తుటి గాయాలయ్యాయి. అయినా వాళ్లు మిథున్‌కు రక్షణగా నిలిచారు.

ఇక తీవ్ర గాయాలతో రక్తమోడుతున్నా ఓ వైఎస్సార్‌సీపీ నేత ఏమాత్రం అధైర్యపడలేదు. తనపై దాడి చేసేవారిని చూస్తూ.. ఒక్క చూపుతోనే సవాల్‌ విసిరినంత పని చేశారాయన. అయితే తీవ్రంగా రక్తమోడిన ఆయన్ని తోటి కార్యకర్తలు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి పళ్లు ఊడిపోయి రక్తం కారింది. మరికొందరికి సైతం టీడీపీ రాళ్ల దాడుల్లో గాయాలైనట్లు తెలుస్తోంది.

నామినేషన్‌ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్ని వాహనాలకు నిప్పంటించినట్లు కథనాలు వెలువడ్డాయి. మరికొన్ని వాహనాలను టీడీపీ కేడర్‌ ధ్వంసం చేసి.. బోల్తా పడేశాయి.  ఈ ఘటనల సమయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లో కాల్పులు జరిపామని మాత్రం పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం మిథున్‌రెడ్డిని, ఆయన సిబ్బందిని నామినేషన్‌ సెంటర్‌లోనే ఓ గదిలో అధికారులు ఉంచారు. టీడీపీ గూండాల బారి నుంచి ఆయన్ని సురక్షితంగా అక్కడి నుంచే తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ‘స్థానిక’ ఎన్నికలు.. ప్రారంభమైన కూటమి కుట్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement